Wednesday, April 24, 2024

ఐఏఎస్ అధికారుల పోస్టులను భర్తీ చేస్తున్నాం.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రుల వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఐఏఎస్ అధికారుల పోస్టులను భర్తీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఖాళీగా ఉన్న సివిల్ సర్వెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఏఐఎస్ విధివిధానాలపై వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ప్రతి లక్ష మందికి అత్యల్ప సివిల్ సర్వెంట్లు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని సంబంధిత శాఖ మంత్రి వెల్లడించారు. ప్రమోషన్ కోటాలో ఖాళీలను భర్తీ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలక్షన్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తోందని, అన్నిచోట్ల పోస్టులను భర్తీ చేయాలని సంబంధింత విభాగాలకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కింద 26,61351 మంది ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 40,213 మంది పని చేస్తున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు.

అక్టోబర్‌లో తగ్గిన ఎగుమతులు

ఈ ఏడాది అక్టోబర్‌లో భారతదేశ ఎగుమతులు తగ్గిపోవడానికి కారణాలపై ఎంపీ శ్రీకృష్ణ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం లిఖితపూర్వక సమాధానాలిచ్చింది. కొన్ని రంగాల్లో మందగమనం ఉందని అంగీకరించారు. కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, డిమాండ్ తగ్గటం తదితర కారణాల వల్ల ఎగుమతులు తగ్గాయన్నారు. గతేడాదితో పోలిస్తే భారతదేశ సరుకుల ఎగుమతులు ఏప్రిల్-అక్టోబర్‌లో 12.52 శాతం పెరిగాయన్నారు. విదేశీ వాణిజ్య విధానాన్ని పొడిగించడం, ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు పథకం, జిల్లాల్లో ఎగుమతి కేంద్రాలను ప్రారంభించడం వంటివి వాణిజ్య లోటు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement