Tuesday, April 23, 2024

భారతదేశానికి నీటి ఎద్దడి? 2050 నాటికి నీటి కష్టాలు తీవ్రతరం – ఐక్యరాజ్య సమితి హెచ్చరిక

మంచినీటి కొరతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది. 2050 నాటికి భారతదేశం నీటి కొరతతో తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో పేర్కొంది. నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రపంచ పట్టణ జనాభా 2016వ సంవత్సరంలో 933 మిలియన్ల నుంచి 2050 నాటికి 2.4 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఐరాస-2023 వాటర్‌ కాన్ఫరెన్స్‌కు ముందు విడుదల చేసిన యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ 2023లో నీటి కొరత విషయం వెల్లడైంది. ప్రపంచంలో నీటి సంక్షోభాన్ని నిరోధించడానికి బలమైన అంతర్జాతీయ యంత్రాంగాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రీ అజౌలే చెప్పారు. నీటి ఒత్తిడిలో నివసిస్తున్న వారిలో 80శాతం మంది ఆసియాలో నివసిస్తున్నారని చెప్పారు.

ముఖ్యంగా, ఈశాన్య చైనా, అలాగే భారతదేశం, పాకిస్తాన్‌ దేశాల్లో నీటిఎద్దడి తప్పదని పేర్కొన్నారు. నీరు మన ఉమ్మడి భవిష్యత్తు. దానిని సమంగా పంచుకోవడానికి, స్థిరంగా నిర్వహించడానికి కలిసి పనిచేయడం చాలా అవసరం. ఈ సమస్యను పరిష్కరించుకోకుంటే కచ్చితంగా ప్రపంచ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేదని, 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుధ్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. ‘మానవాళికి జీవనాధారం నీరు అని, ప్రజల మనుగడకు ఇది చాలా ముఖ్యమైంది అని గుటెర్రెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలనేది ముఖ్యమైన అడుగు అని చెప్పారు. మనం దీనిని పరిష్కరించకపోతే, ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభం ఏర్పడుతుంది అని హెచ్చరించారు. నీరు మానవాళికి జీవనాధారం. ఇది మనుగడకు చాలా ముఖ్యమైనది, ప్రజల ఆరోగ్యం, స్థితిస్థాపకత, అభివృద్ధి, శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది. మానవత్వం గుడ్డిగా ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది. పిశాచమైన అధిక వినియోగం, అధిక అభివృద్ధి, నిలకడలేని నీటి వినియోగం, కాలుష్యం, తనిఖీచేయని గ్లోబల్‌ వార్మింగ్‌ మానవాళి జీవనాధారాన్ని చుక్కల వారీగా హరిస్తున్నాయని ఈ నివేదిక మనకు గుర్తుచేస్తుందని గుటెర్రస్‌ చెప్పారు.

- Advertisement -

26శాతం మందికి అందని శుద్ధజలం..

ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీస పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా శుద్ధమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు అందాలని ఐరాస పెట్టుకొన్న లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని యూఎన్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్టు-2023లో పేర్కొన్నది. లక్ష్యాలను చేరుకొనేందుకు ఏడాదికి 600 బిలియన్‌ నుంచి ఒక ట్రిలియర్‌ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రిచర్డ్‌ కాన్నర్‌ తెలిపారు. గత 40 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం ఏడాదికి దాదాపు ఒక శాతం వరకు పెరుగుతున్నదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement