Tuesday, March 26, 2024

Delhi | వ్యర్థాల నిర్వహణ అందరి బాధ్యత.. మేయర్ల సదస్సులో కేంద్ర మంత్రి మురళీధరన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పట్టణాలు, నగరాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ అన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత మేయర్లు – రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి బాధ్యత అని అన్నారు. జూన్ 5న ప్రారంభమైన మూడ్రోజుల సదస్సు ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ప్రధాన మంత్రి స్వచ్ఛ భారత్ పేరుతో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.

ప్రపంచ పర్యావరణ ప్రదర్శనలో భాగంగా ‘వ్యర్థ పదార్థాల నిర్వహణ’ అంశంపై జరిగిన ఈ సదస్సులో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో పాటు జైన మతాచార్యులు డా. లోకేశ్ ముని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (కోర్వా) సభ్యులు రాజన్ ఛిబ్బర్ (అనుసంధాన సలహాదారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కల్నల్ తేజేంద్ర పాల్ త్యాగి (ఛీఫ్ కన్వీనర్, కోర్వా),  ఆర్.ఎస్.వి బద్రీనాథ్ (రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాదు), స్వదేశ్ కుమార్ (అధ్యక్షులు, గ్రీన్ సొసైటి ఆఫ్ ఇండియా), కరుణ సింగ్ (రీజనల్ డైరెక్టర్, దక్షిణ మరియు ఆగ్నేయాసియా – ఎర్త్ డే నెట్వర్క్),  రాయనపూడి భాగ్యలక్ష్మి (మేయర్, విజయవాడ), కె. వి. సత్యవతి (అడిషనల్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్)తో పాటు దేశంలోని పలు నగరాల మేయర్లు, సంబంధిత రంగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.

ఆచార్య లోకేష్ ముని మాట్లాడుతూ వినియోగ సంస్కృతి, పౌర బాధ్యతలపై అవగాహన లేమి కారణంగా లోకంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగోళం వ్యర్థాలతో నిండిపోతోందని అన్నారు. అందరూ చెట్లను నాటడం మరియు సంరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ రక్షణలో పాల్పంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్నల్ తేజేంద్ర పాల్ త్యాగి మాట్లాడుతూ ‘రెడ్యూస్ – రీయూస్ – రీసైకిల్’ నినాదాన్ని అందరూ పాటించాలని కోరారు.  వ్యర్థ సంబంధిత సమస్యలపై ప్రతిఒక్కరూ గళం విప్పాలని, లేఖలు, అర్జీల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సత్వరమే ఏ సమస్యా పరిష్కారం కాదని, నిరంతర కృషి కొనసాగించాలని అన్నారు. సదస్సులో భాగంగా గ్రీన్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఆర్.ఎస్.వి బద్రీనాథ్, మద్దుకూరి వెంకట సుబ్బారావు తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement