Wednesday, April 24, 2024

విశాఖ పోర్టు రికార్డుల పరంపర, పెద్ద ఎత్తున‌ కార్గో హ్యాండ్లిగ్‌.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: విశాఖపట్నం పోర్ట్‌ అధారిటీ మరో అరుదైన రికార్డును సాధించింది. ఒకే రోజులో పోర్ట్‌లో అత్యధిక సరుకును హ్యాండిల్‌ చేసిన ఘనతను సాధించింది. 3,76,460 మెట్రిక్‌ టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేయడం ద్వారా విశాఖపట్నం పోర్టు అథారిటీ ఈ ఘనతను సాధించిందని పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మెహన్‌రావు తెలిపారు. అయితే విశాఖ పోర్టు ట్రస్టులో నెల రోజుల వ్యవధిలోనే వరుసుగా రెండో సారి రికార్డులను సాధించడం గమనార్హం.గత నెల 26వ తేదిన ఒక్క రోజులో రికార్డు స్ధాయిలో విశాఖపట్నం పోర్టు 3,73,544 మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా హ్యాండిల్‌ చేసి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రికార్డును పోర్టు నెల రోజుల వ్యవధిలో మరో మారు అధిగమించింది.

ఇన్నర్‌ హార్బర్‌, అవుటర్‌ హార్బర్‌, ఎస్‌పిఎంల నుంచి 3,76,460 మెట్రిక్‌ టన్నుల సరుకును హ్యాండిల్‌ చేయడం ద్వారా ఒక్కరోజులో అత్యధిక సరుకును హ్యాండిల్‌ చేసి రికార్డ్‌ సృష్టించడం గొప్ప విషయమని పోర్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 19న పోర్టుకు వచ్చిన 22 నౌకల ద్వారా ఈ సరుకును హ్యాండిల్‌ చేశారు. ప్రస్తుతం ఈ రికార్డులను అధిగమించి విశాఖపట్నం పోర్ట్‌ అధారిటీ నూతన రికార్డును నెలకొల్పడంతో పోర్టు సాధించిన ఈ ఘనత పట్ల చైర్మన్‌ కే.రామమోహనరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ట్రాఫిక్‌ డిపార్ట్మెంట్‌ మేనేజర్‌ రత్న శేఖర్‌ను, ట్రాఫిక్‌ విభాగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించి పోర్టు అభివృద్ధికి నిరంతం కృషి చేయాలని అభిలషించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్‌ దుర్గేష్‌ కుమార్‌ దుబే, సెక్రటరీ వేణుగోపాల్‌, పోర్టు విభాగాధిపతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement