Thursday, April 25, 2024

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయి రెడ్డి.. కొత్త జాబితాలో నామినేటెడ్ ఎంపీ పీటీ ఉషకు చోటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి మరోసారి నియమితులయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ సభలోనే ప్రకటించారు. రాజ్యసభ బిజినెస్ రూల్స్‌లోని రూల్ నెంబర్ 8, సబ్ రూల్ 1 ప్రకారం ఈ నియామకం చేస్తున్నట్టు ఆయన నియామక ఉత్తర్వులలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డితో పాటు ప్రముఖ అథ్లెట్, నామినేటెడ్ ఎంపీ పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో చేర్చారు. తాజా ఉత్తర్వులతో ప్యానెల్ వైస్ ఛైర్మన్ల సంఖ్య 9కి చేరింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హయాంలో ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో ఉన్న విజయసాయి రెడ్డిని, కొత్త ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్ కూడా కొనసాగిస్తూ తొలుత ఉత్తర్వులిచ్చారు. అయితే సభలో పేర్లను ప్రకటించినప్పుడు విజయసాయి రెడ్డి సహా మరో ఇద్దరి పేర్లు జాబితా నుంచి అదృశ్యమయ్యాయి.

ధన్కడ్ జాబితాను పునర్వ్యవస్థీకరించినట్టు తెలిసింది. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి, పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో చేర్చారు. ఈ ఇద్దరితో పాటు భువనేశ్వర్ కలిత, డా. ఎల్. హనుమంతయ్య, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డా. సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నాగర్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభను సభాపతి స్థానంలో ఆశీనులై సభను నిర్వహించే అవకాశం ప్యానెల్ వైస్ ఛైర్మన్లకు ఉంటుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విజయసాయి రెడ్డి ఒకట్రెండు సందర్భాల్లో సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement