Friday, April 19, 2024

బార్లపై నిఘా.. మైనర్లకు మద్యం విక్రయిస్తే కేసులే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాలపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సర్కార్‌ యోచిస్తోంది. 21 ఏళ్లలోపు మైనర్లకు మద్యం సరఫరా, సమయం మించిన తర్వాత మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లేమి వంటి వాటిని కఠిన చర్యలతో కట్టడి చేయాలని నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సుల రద్దుతోపాటు పీడీ యాక్టు కేసులను నమోదు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంనుంచి ఆబ్కారీ శాఖకు కీలక సూచనలు చేసింది. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించరాదని ఆబ్కారీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ప్రతీ బార్‌, వైన్‌ షాపు తప్పనిసరిగా 21 ఏళ్లలోపు మైనర్లకు మద్యం విక్రయించేదిలేదని బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇది ఎక్కడా అమలు కాకపోవడంపై సర్కార్‌ ఆగ్రహంగా ఉంది.

కాగా మద్యం విక్రయాలకు సమయాన్ని పొడిగించాలని బార్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతుండటంతో ప్రభుత్వం కీలక చర్యలను పరిశీలిస్తోంది. ప్రతీ బార్‌, మద్యం దుకాణానికి చెందిన సిట్టింగ్‌లో ఇకపై సీసీ(క్లోజ్డ్‌ సర్య్కూట్‌ కెమెరా)లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ యోచిస్తోంది. మద్యం దుకాణం రాత్రి 10 గంటలకు, బార్‌ 11 గంటలకు మూసివేసేలా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదార్లకు సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లపై కూడా నివేదిక రూపొందించారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు నడపాలనే యోచనను విరమించుకోనున్నట్లు సమాచారం.

గ్లోబల్‌ సిటీ(అంతర్జాతీయ నగరం)పేరుతో హైదరాబాద్‌లో అనుసరించాలని యోచించిన ప్రతిపాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, మద్యం అనర్ధాలపై దృష్టి సారించాలని వివిధ శాఖలతో సమన్వయంగా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు. కల్లు దుకాణాల్లో దాడులను మరింత తీవ్రం చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌డీపీపై ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఎక్కువగా ఉదయం నిర్దేశిత సమయానికి ముందే మద్యం దుకాణాలు, బార్లు తెరిచి విక్రయాలను ప్రారంభిస్తున్నారని అందిన సమాచారంపై ప్రభుత్వం స్పందించింది. వీటిపై దాడులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా మద్యం విక్రయాలు, ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయని పరిశీలించారు. ప్రధానంగా ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు 60 శాతం విక్రయాలు సాగుతున్నాయని, రాత్రి 7 తర్వాత 12 గంటలవరకు ఒక్కసారిగా 40 శాతం వినియోగం జరుగుతున్నట్లు గుర్తించారు. తాజాగా ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలా విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించడం సులువవుతోంది. దీనిని బార్లలో కూడా అమలులోకి తెచ్చి వీడియా కెమెరాలకు అనుసంధానించాలని నిర్ణయించారు.

పీడీ, బైండోవర్‌లకు లొంగని వైనం…

- Advertisement -

ఇప్పటికే పీడీ యాక్టు, బైండోవర్‌లను అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదని ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో చట్ట సవరణద్వారా కఠిన శిక్షలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1968లో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏపీ ప్రొహిబిషన్‌ యాక్టులో కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు తేవాలని ఆదేశించారు. పీడీ యాక్టు…ప్రవెన్షన్‌ ఆఫ్‌ డిటెన్షన్‌ యాక్టు, దీనిని పార్లమెంటు చట్టంతో 1950లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1), 21(2) ద్వారా అమలులోకి తెచ్చారు. ఇందులో 34 సెక్షన్లు ఇమిడి ఉన్నాయి. దీనిని మరింత విస్తరించి మైనర్లకు మద్యం విక్రయించే వ్యాపారులపై కూడా మోపాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement