Tuesday, April 23, 2024

వందే భారత్‌ రైలుకు విశేష ఆదరణ.. మధ్యంతర స్టేషన్లలో భారీగా ఎక్కుతున్న ప్రయాణీకులు

అమరావతి,ఆంధ్రప్రభ: సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైలుకు విశేష ఆదరణ లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యం గా సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్యనున్న మధ్యంతర స్టేషన్లు వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిల మధ్య ప్రయాణీకులు అధికంగా ప్రయాణీస్తున్నారని తెలిపింది. దాదాపు 140 శాతం అక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని వెల్లడించింది. పగటి పూట ఈ రైలు నడుస్తుండడంతో వివిధ పనుల నిమిత్తం ఈ స్టేషన్ల మధ్య తిరిగే ప్రయాణీకులు అధికంగా ఈ రైల్లో ప్రయాణీస్తున్నారని తెలిపింది. గత నెల కాలంలో విజయవాడ నుండి ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌కు 8,613 మంది ప్రయాణీకులు రాగా, 9,883 మంది రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణీంచారని తెలిపింది.

మరోవైపు విశాఖపట్నం వైపు నుంచి 9,742 మంది ప్రయాణికులు విజయవాడకు రాగా, మరో 10,970 మంది సికింద్రాబాద్‌ వైపు నుంచి విజయవాడకు రాకపోకలు సాగించారు. విజయవాడ స్టేషన్‌ నుండి ప్రతిరోజూ సగటు-న 638 మంది వ్యక్తులు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతున్నారు. మరో 714 మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్‌లో ప్రతిరోజూ రైలు దిగుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు ప్రయాణీకుల నుండి విశేషమైన ఆదరణ ఉంది .ఈ రైలు ఇరువైపులా పూర్తి సామర్థంతో నడుస్తోంది. విజయవాడ నుండి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ హై-స్పీడ్‌ రైలులో ప్రయాణించడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రయాణీకుల నుండి అందిన స్పందన కుడా చాలా సంతృప్తికరంగా ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ?దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందిస్తున్న వేగం మరియు సౌకర్యాన్ని బట్టి, ఈ రైలు విజయవాడ మరియు సమీప ప్రాంతాల రైలు ప్రయాణీకుల కోసం ఇష్టపడే రైలు సర్వీస్‌లలో ఒకటిగా నిరూపించబడిందని చెప్పారు. ఈ రైలు ప్రపంచ స్థాయి రైలు సౌకర్యాలను కలిగివుండటమే కాకుండా రైలు ప్రయాణీకుల ఆకాంక్షలను తీర్చగలిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement