Thursday, April 25, 2024

రైతుగా మారిన జ‌ర్న‌లిస్ట్ – మంచి ఆహారం- నెల‌కి ల‌క్ష‌ల్లో ఆదాయం

ఓ జ‌ర్న‌లిస్ట్ రైతుగా మారాడు.దీని వెనుక పెద్ద క‌థే ఉంది. వివ‌రాల్లోకి వెళ్తే..ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌రేలీకి చెందిన రాంవీర్ సింగ్ జ‌ర్న‌లిస్ట్ గా చేస్తున్నాడు.కాగా రామ్‌వీర్ సింగ్ స్నేహితుడి మేనమామకు 2009లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ బారిన పడడానికి కారణం కెమికల్‌తో కూడిన కూరగాయల వలన అని పరిశోధనలో తెలిసిందట… దీంతో రామ్‌వీర్ సింగ్‌లో భయం మొదలైంది. తన కుటుంబాన్ని అలాంటి ప్రమాదాల నుండి కాపాడాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యాడు.
తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్వీకులు ఇచ్చిన భూమిలో సేంద్రీయ కూరగాయలను పండించాలనుకున్నాడు. పొలం.. బరేలీ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. దీంతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. వృత్తిగా వ్యవసాయ దారుడిగా మారి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టాడు. 2017-18లో రామ్‌వీర్ సింగ్ వ్యవసాయ సంబంధిత కార్యక్రమంలో భాగంగా దుబాయ్ లో హైడ్రోపోలిక్ వ్య‌వ‌సాయం గురించి తెలుసుకున్నాడు. ఈ వ్యవసాయ పద్ధతికి నేల అవసరం లేదు, తక్కువ కీటకాలతో సాగు చేయవచ్చు. అంతేకాదు మొక్కల పెరుగుదలకు అవసరమైన నీటిలో దాదాపు 80% ఆదా అవుతుందని తెలిసింది.

దీంతో అక్కడే రెండు వారాల పాటు రైతుల నుండి వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నాడు. స్వగ్రామానికి వచ్చిన తర్వాత తన ఇంట్లో వ్యవసాయ పద్ధతులతో కూరగాయలను పండించాలని ప్రయత్నించాడు.. హైడ్రోపోనిక్స్ పొలాల పట్ల మక్కువతో వ్యవసాయం మొదలు పెట్టిన రామ్‌వీర్ సింగ్ ఇప్పుడు తన మూడంతస్తుల భవనాన్ని హైడ్రోపోనిక్స్ ఫామ్‌గా మార్చేశాడు. తన భవనంలోని బాల్కనీలు , పైపులు , ఇతర పరికరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో హైడ్రోపోనిక్స్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇందుకు న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ (NFT), డీప్ ఫ్లో టెక్నాలజీని ఉపయోగించాడు. ఇప్పుడు 750 చదరపు మీటర్లలో 10,000 మొక్కలతో వ్యవసాయం చేస్తున్నాడు. బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సీసా పొట్లకాయ, టమోటాలు, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీలు, మెంతులు , పచ్చి బఠానీలు అతను పండించే కొన్ని కూరగాయలు. ఓ వైపు ఆరోగ్యకరమైన కూరగాయలను పొందుతూనే మరోవైపు ఏడాదికి లక్షల రూపాయలను ఆదాయంగా పొందుతున్నాడు. దాంతో ఇప్పుడు ఈయ‌న పేరు మారుమ్రోగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement