Tuesday, April 23, 2024

విశాఖ పర్యాటకానికి కేంద్రం పెద్దపీట.. సింహాచలం దేవస్థానం, క్రూయిజ్ టెర్మినల్‌కు నిధులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సాగరతీర నగరం విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సింహాచలం దేవస్థానం, క్రూయిజ్ టెర్మినల్ కోసం నిధులు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు గురువారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఓడరేవులోని ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ బెర్త్, ఛానల్ బెర్త్‌ల నిర్మాణానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.38.50 కోట్లు కాగా, అందులో రూ.29.91 కోట్లను పర్యాటక శాఖ విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు ఇప్పటికే విడుదల చేసినట్లు వెల్లడించారు.

క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి ఆర్థిక సహాయం అందించిందని, తద్వారా 64 శాతం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రసాద్ పథకం కింద సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 2022-23లోనే రూ.54.04 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు.

- Advertisement -

క్రూయిజ్ టూరిజం అనేది అత్యంత శక్తిమంతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతా రంగాలలో ఒకటని, 2022 మే14, 15వ తేదీలలో జరిగిన మొదటి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ కాన్ఫరెన్స్‌లో తాను చెప్పిన విషయాలను కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

దేశంలోని క్రూయిజ్ హబ్‌లుగా విశాఖపట్నం సహా దేశంలోని వివిధ ఓడరేవులు  టూరిజం పరిశ్రమలో విస్తారమైన వ్యాపార అవకాశాలు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. విశాఖలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement