Friday, March 31, 2023

రబీ సీజన్‌, ఎండాకాలంలో నిరంతర విద్యుత్‌ సరఫరా.. వేసవిలో 15500 మెగావాట్లను మించనున్న డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రబీ సీజన్‌లో వ్యవసాయానికి, రానున్న వేసవిలో గృహ, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా నిరంతర సరఫరా కొనసాగించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు రబీ సీజన్‌లో పంటలు ఎండిపోకుండా డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. గృహ, పరిశ్రమల వినియోగదారుల పెరుగుదలతోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా నేపథ్యంలో వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగి 15500 మెగవాట్లను మించే అవకాశముందన్నారు.

- Advertisement -
   

డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సరఫరా ఉండేలా పంపిణీ సంస్థల సీఎండీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత రబీసీజన్‌తో పాటు రానున్న ఎండాకాలంలో విద్యుత్‌ సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్‌కో ఛైర్మన్‌ ప్రభాకర్‌రావుతోపాటు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీలతో మింట్‌కాంపౌండ్‌లోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి ప్రతి ఏటా విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా నమోదవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6666 మెగవాట్లుగా ఉన్న డిమాండ్‌ గత ఏడాది రబీ సీజనల్లో 14160 మెగావాట్లకు చేరిందన్నారు. అదే విధంగా… విద్యుత్‌ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంపైనా సీఎండీలతో మంత్రి చర్చించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న 1553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను , 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌/ఎలక్ట్రికల్‌ పోస్టులతోపాటు మొత్తం 1601 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జీ. రఘుమారెడ్డిని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement