Friday, March 29, 2024

రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన కొనసాగుతోంది : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాల‌న కొన‌సాగుతోంద‌ని, రాజ్యాంగం మంచిదే… అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కాకపోతేనే సమస్య అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం పరిరక్షింపబడినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంద‌న్నారు. రాజ్యాంగం ఎలా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు మంచి వాళ్లు అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటను గుర్తుంచుకోవాలని అన్నారు. అవకాశాలు కల్పిస్తే తెలుగు ప్రజలు మరిన్ని అద్భుతాలు సాధిస్తారన్నారు.

ఇదే ఆలోచనతో 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పనిచేశామని, అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలతో సర్వనాశనం చేసిందని అన్నారు. యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని అమలు చేస్తే.. ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుంది. ఇప్పుడే ‘విజన్-2047’ సిద్ధం చేసుకుని… ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా.. దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నాడు వచ్చిన ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, సంస్కరణల ఫలితాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పొందుతోంది” అని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement