Friday, April 26, 2024

పోర్టులపై రాజీలేని పోరాటం.. త్వరలో రామాయంపట్నం పోర్ట్ పనులు : వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులపై కేంద్రమంత్రులను కలిసి రాజీలేని పోరాటం చేస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆ పార్టీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వంగా గీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… రామాయపట్నం పోర్ట్ పనులు త్వరలో మొదలవుతాయని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పోర్టును నిర్మిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టుకి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, త్వరలో వాటిని పరిష్కరించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని చెప్పుకొచ్చారు. పోర్టులు వస్తే ఎస్‌ఈజడ్‌లు వచ్చి ఆర్ధిక వృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దుగరాజపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల జాప్యం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రాజెక్టులు వచ్చేలోపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోందన్నారు.
అనంతరం వంగా గీత మాట్లాడుతూ… పోర్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. రామాయపట్నం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని, అయితే అన్ని ప్రాజెక్టులనూ ఇలా స్వయంగా నిర్మించుకోవడం సాధ్యం కాదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. నితిన్ గడ్కరీ ఏపీకి వచ్చి అనేక ప్రాజెక్టులు ప్రారంభించారని, ఇంకా అనేక ప్రాజెక్టులకు ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు కూడా ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. వాటిలో కొన్ని మంజూరయ్యాయని, పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా త్వరగా మంజూరు చేయాలని, అలాగే రాష్ట్రంలోని విమానాశ్రయాలనూ అభివృద్ధి చేయాలని వంగ గీత కేంద్రాన్ని కోరారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు వృద్ధి చెందితే రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయని ఆమె వివరించారు. వరద కేవలం ఒక్కచోటే రాలేదన్న వంగా గీత, అధిక వర్షాలు వరదకు కారణమవుతున్నాయని వంగా గీత అన్నారు. 1986 తర్వాత ఇంత ఎక్కువ వరద వచ్చిందని అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. ప్రాజెక్టు ఎత్తు అనేది సాంకేతిక అంశమని, ఈసారి వచ్చిన వరదలు మాత్రం ఎత్తుతో సంబంధం లేకుండా, కురిసిన అధిక వర్షాల కారణంగా వచ్చాయని ఎంపీ గీత స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు “పోలవరం ప్రాజెక్టు అథారిటీ” ఆధ్వర్యంలో నిర్మాణం సాగుతోందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు సహా ఇతర సాంకేతిక వివరాలన్నీ పీపీఏ పరిశీలించి, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక సంస్థలు అధ్యయనం చేసి నిర్మాణాన్ని చేపట్టాయని, దీనిపై వివాదం చేయడం తగదని హితవు పలికారు. రామాయపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘నీలి విప్లవం’ (సముద్ర జలాల ఆధారంగా ఆర్ధిక వృద్ధి కోసం) సృష్టించేందుకు సీఎం జగన్ వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి పెట్టుబడిదారులకు ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగేలా మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని వెల్లడించారు. వాటికి అవసరమైన అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్తున్నామని అయోధ్య రామిరెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement