Saturday, April 20, 2024

అందుబాటులో లేని తక్కువ ధరల ఇళ్లు.. 20 శాతం తగ్గిన నిర్మాణాలు

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 40 లక్షల లోపు ధర ఉండే ఇళ్ల అందుబాటు 20 శాతం తగ్గింది. 2018లో ఇది 40 శాతంగా ఉంది. తక్కువ ధరల ఇళ్ల సరఫరా తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తెలిపింది. ప్రధానంగా భూముల ధరలు పెరగడం, ధర తక్కువ ఇళ్ల నిర్మాణంలో తక్కువ మార్జిన్‌ ఉండటం, సరైన ఫైనాన్స్‌ సదుపాయం లభించకపోవడం ప్రధాన కారణమని పేర్కొంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ ధరలకు లభించే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ముందుకు రాకపోవడంతోనే వీటి సరఫరా తగ్గింది. అనరాక్‌ విడుదల చేసిన డేటా ప్రకారం 2022లో 3,57,650 యూనిట్లను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు నిర్మించాయి. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే. 40 లక్షలకు తక్కువ ధర లభించే నివాస గృహాలు ఉన్నాయి. 2018లో మొత్తం 1,95,300 నివాస గృహాలను రియల్‌ సంస్థలు నిర్మించాయి. వీటిలో 40 శాతం వరకు అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లు ఉన్నాయి.

2019లోనూ నిర్మించిన 2,36,560 యూనిట్లలో 40 శాతం అందుబాటు ధరలో ఉన్న ఇళ్లు ఉన్నాయని అనరాక్‌ తెలిపింది. 2020లో 1,27,960 యూనిట్లను నిర్మించగా, అందులో 30 శాతం ఇళ్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. 2021లో మొత్తం 2,36,700 యూనిట్లు నిర్మాణమయ్యాయి. వీటిలో 26 శాతం మాత్రమే అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లు ఉన్నాయి. 2022లో ఇది మరింతగా తగ్గి కేవలం 20 శాతం యూనిట్లు మాత్రమే అందుబాటు ధరల్లో లభించేవి ఉన్నాయి.

- Advertisement -

గత మూడు సంవత్సరాలుగా మధ్య తరగతి వారికి అందుబాటులో ధరల్లో లభించే నివాస గృహాల లభ్యత తగ్గిపోతూ వస్తోంది. ఇందుకు ప్రధానంగా పెరుగుతున్న భూమి ధరలేనని, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు లగ్జరీ, ప్రీమియం ఇళ్ల నిర్మాణంలోనే మార్జిన్లు మిగులుతాయని, తక్కువ ధరల ఇళ్ల నిర్మాణంలో మార్జిన్లు తగ్గుతున్నాయని అన్‌రాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పూరి అభిప్రాయపడ్డారు. ఒక వైపు మార్జిన్లు తగ్గడంతో పాటు, సిమెంట్‌, స్టీల్‌ ధరలు పెరగడం, కార్మికుల ఖర్చు కూడా పెరగడంతో బడ్జెట్‌ ఇళ్ల నిర్మాణం తగ్గుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 40 లక్షల నుంచి 1.5 కోట్ల ధరల్లో ఉండే అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ పెరుగుతుందని అనరాక్‌ తెలిపింది. మరో వైపు దేశంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతున్నదని ఈ రంగంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement