Saturday, April 20, 2024

మిగతా డిమాండ్లపైనా అల్టిమేటం.. కేంద్రానికి డిసెంబర్ 4 డెడ్‌లైన్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన రైతులు, మిగతా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద జరిగిన వివిధ రైతు సంఘాల సమాహారం సంయుక్త కిసాన్ మోర్చా శనివారం కీలక సమావేశం నిర్వహించింది. తదుపరి కార్యాచరణపై కూలంకశంగా రైతు సంఘాల నేతలు చర్చించారు. ఈనెల 29న పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని రైతు సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత, విద్యుత్తు బిల్లు ఉపసంహరణ డిమాండ్లు కూడా నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాయి.

డిసెంబర్ 4 వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయమిస్తూ.. ఆలోగా నిర్ణయం తీసుకోవాలని సంయుక్త్ కిసాన్ మోర్చా అల్టిమేటం జారీ చేసింది. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు ఆందోళన విరమించేదే లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 4లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించింది. మద్ధతు ధరకు పార్లమెంటులో గ్యారంటీ ఇవ్వాలని సంయుక్త్ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. అలాగే అందోళ‌న సందర్భంగా రైతులపై న‌మోదు చేసిన కేసులను ఉప‌సంహ‌రించుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే శాఖ‌ను ప్రధాని మోదీ అదేశించాలని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
అన్ని డిమాండ్లూ నెరవేరాయి – ఆందోళన విరమించండి: కేంద్రం
రైతు సంఘాల భవిష్యత్ కార్యాచరణ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. వ్యవసాయంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రధాని ఒక కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ కమిటీ కనీస మద్ధతు ధరలో పార్దర్శకత, సమర్థతపై మెరుగైన విధానాలను సిఫార్సు చేయడంతో పాటు పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంశాలపై కూడా తగిన సూచనలు చేస్తుందని తోమర్ తెలిపారు. కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని గుర్తుచేశారు. ఈ చర్యతో రైతుల కనీస మద్ధతు ధర డిమాండ్ కూడా నెరవేరిందని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలన్న రైతు సంఘాల డిమాండ్‌కు సైతం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని తోమర్ అన్నారు. రైతులు తక్షణమే తమ ఆందోళనను ముగించి ఇంటికి వెళ్లాలని కోరారు. నిరసన సమయంలో నమోదైన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశమని, దానిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. అలాగే చనిపోయిన రైతులకు పరిహారం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానం ప్రకారం నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement