Friday, April 19, 2024

శ్రీ ప్లవ నామ సంవత్సరం.. ఉగాది శుభాకాంక్షలు

ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఏప్రిల్ 13తో శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ్ సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని.. ఆరోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని.. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతుంటారు. 

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం.

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. తెలుగువారి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి పూజగదిలో కచ్చితంగా పంచాంగం ఉండాలి. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం చేస్తారు.  షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. జీవితం షడ్రుచుల సమ్మేళనం అనీ దానికి సూచనగానే ఉగాది పచ్చడిలో కూడా ఆరు రకాల రుచులు ఉంటాయనీ నమ్మిక.  వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు.  షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు. ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలని హరిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement