Tuesday, April 16, 2024

పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు రెండు కమిటీలు.. ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు గడువు మరోసారి సవరించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు, సవరించిన గడువు తదితర అంశాలపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సోమవారం (18.07.2022) సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతంలో నిర్ణయించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏప్రిల్ 2022 నాటికి పూర్తిచేయాలని అనుకున్నామని, అయితే ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తికాలేదని తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ 77 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 93 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 72 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల తాజా స్థితిగతులు, జాప్యానికి కారణాలపై అధ్యయనం చేసేందుకు నవంబర్ 2021లో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, ఆ కమిటీ ఏప్రిల్ 2022 నాటికి నివేదిక సమర్పించిందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి సవరించిన గడువును జూన్ 2024గా కమిటీ సూచించిందని వెల్లడించారు.

ఖర్చుపెట్టే సామర్థ్యం తక్కువగా ఉండడం, అనుకున్నంతగా నిర్మాణం జరగకపోవడం, వ్యూహాత్మక ప్రణాళికలు లేకపోవడం, ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సంస్థతో సరైన సమన్వయం లేకపోవడం సహా కోవిడ్-19 మహమ్మారి వంటి కారణాలు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణాలని కమిటీ నివేదిక పేర్కొన్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఇకపై ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని, అందులో భాగంగా డ్యామ్ డిజైన్ అండ్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ)తోపాటు ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 14 సమావేశాలు నిర్వహించగా, డీడీఆర్పీ 20 సమావేశాలు, నిపుణుల కమిటీ 7 సమావేశాలు నిర్వహించిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement