Friday, March 29, 2024

దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యంపై టీఎస్‌ ఆర్టీసీ దృష్టి.. దావణగెరేకు కొత్త సూపర్‌ లగ్జరీ బస్సు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దూర ప్రాంతాల ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడంపై టీఎస్‌ ఆర్టీసీ దృష్టి సారించింది. డిమాండ్‌ ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభిస్తోంది. దీంతోపాటు అధిక ఆదాయాన్ని సైతం ఆర్జిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటక రాష్ట్ర్రంలోని దావణగెరే పట్టణానికి కొత్త సూపర్‌ లగ్జరీ సర్వీస్‌ను టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి దావణగెరేకు ప్రతీ రోజు సాయంత్రం 6-40కు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్‌ కేపీహెచ్‌బి, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, మహబూబ్‌నగర్‌, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్‌ మీదుగా దావణగెరే చేరుకుంటుంది. దావణగెరే నుంచి ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరుతుంది.

మియాపూర్‌ నుంచి దావణగెరేకు రూ.872, ఎంజీబీఎస్‌ నుంచి రూ.840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్‌ర్టీసీ ఎండీ విసి సజ్జన్నార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య కర్ణాటకలోని దావణగెరేకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. డిమాండ్‌ దృష్ట్యా దావణగెరేకు కొత్త లగ్జరీ బస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

- Advertisement -

ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ కర్ణాటకలోని బెంగళూరు, రాయచూర్‌ తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామనీ, అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండటం హర్షణీయమన్నారు. దావణగెరే సర్వీసు శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందనీ, టికెట్‌ బుకింగ్‌ కోసం టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ సీవోవో డా.వి.రవీందర్‌, ఈడీలు పురుషోత్తం, వినోద్‌కుమార్‌, మునిశేఖర్‌, సీఎంఈ రఘునాథరావు సీటీఎం జీవన్‌ప్రసాద్‌, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement