Friday, March 29, 2024

మేలో ఎంసెట్‌.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మే నెలలో ఎంసెట్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారుపై ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒకట్రెండు రోజుల్లో అధికారులు సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల టైం టేబుల్‌, జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు ఇప్పటికే వెలువడడంతో ఇక తెలంగాణ ఎంసెట్‌ ఎంట్రెన్స్‌-2023 షెడ్యూల్‌పై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలను కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలు జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో జరుగనుండగా, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. అయితే జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలను పరిగణలోకి తీసుకొని ఎంసెట్‌ షెడ్యూల్‌ను రూపొందించే పనిలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేపడుతోంది.

- Advertisement -

ఒకట్రెండు రోజుల్లో ఉన్నత విద్యామండలి అధికారులు, ఎంసెట్‌ కన్వీనర్‌, ఇతర అధికారులు సమావేశమై ఎంసెట్‌ షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. మే మూడో వారంలో లేదా మే 20వ తేదీ తర్వాత ఎంసెట్‌ పరీక్షను నిర్వహించే అవకాశం కనబడుతోంది. కోవిడ్‌ కారణంగా, గత రెండేళ్లుగా ఎంసెట్‌ను ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గతేడాది జేఈఈ షెడ్యూల్‌ పలుమార్లు మారడంతోనూ ఎంసెట్‌ నిర్వహణలో ఆలస్యమైంది. దీంతో ఆ ప్రభావం విద్యా సంవత్సరంపైన పడి కౌన్సెలింగ్‌, తరగతులు ఆలస్యంగా జరగడం లాంటిది జరిగింది. ఈసారి ఎంసెట్‌ ఆలస్యంగా నిర్వహించకుండా సకాలంలో షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

అందుకు అనువైన తేదీలను అధికారులు ఖరారు చేయనున్నారు. జూన్‌లో ఫలితాలను ప్రకటించి, ఆగస్టులో కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్‌ మొదటి వారంలో 2023 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ అంశంపై ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారుపై నిర్వహించే సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement