Friday, March 29, 2024

సీబీఐ ముందుకు టీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్.. నకిలీ సీబీఐ అధికారి కేసులో విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస రావు కేసులో టీఆర్ఎస్ నేతలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా విచారణకు హాజరుకావాలని నోటీసులు అందుకున్నారు. దీంతో వారిద్దరూ గురువారం ఢిల్లీ చేరుకుని ఉదయం గం. 11.00 సమయంలో సీజీవో కాంప్లెక్సు దగ్గరున్న సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. రాత్రి గం. 8.00 వరకు నేతలిద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అంతేకాదు, శ్రీనివాస్‌ను ఎదురుగా తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్టు విచారణ అనంతరం మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సీబీఐ అధికారుల దగ్గర ఉన్న సీసీటీవీ పుటేజ్, ఇతర డాటాను తమ ముందుంచి ప్రశ్నలు అడిగారని వివరించారు. తాము చెప్పిన అన్ని అంశాలను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారని, సిబిఐ అధికారుల దగ్గర ఉన్న సమాచారంతో తామిచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారని ఆయన తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ అని, తామిచ్చిన సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారని, మళ్లీ విచారణకు రావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తమతో ఎటువంటి లావాదేవీలు జరపలేదని నిందితుడు శ్రీనివాస్ సైతం ఒప్పుకున్నాడని, దీంతో సీఆర్పీసీ 161 ప్రకారం తామిచ్చిన వాంగ్మూలంపై సంతకాలు తీసుకున్నారని వివరించారు. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు తనను, వద్దిరాజు రవిచంద్రను వేర్వేరు 8.30 గంటల పాటు ప్రశ్నించారని, నిందితుడు శ్రీనివాస్ ఫోన్లో తమ నెంబర్, ఫొటోలు ఉన్నందువల్ల విచారణకు పిలిచినట్టుగా చెప్పారని అన్నారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా విచారణకు హాజరయ్యామని, న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఎలా పరిచయమయ్యాడని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు మున్నూరు కాపు సమావేశంలో రెండు సార్లు కలిశాడని, అంతకుమించి అతినితో ఎలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపారు.

ఆ బంగారం మాది కాదు: వద్దిరాజు రవిచంద్ర

- Advertisement -

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనిచ్చారని జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించగా.. ఆ బంగారం తమది కాదని ఆయన వివరణ ఇచ్చారు. తాను కొనిచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి విచారణకు పూర్తిగా సహకరించినట్టు ఆయన వెల్లడించారు. ఇంటితో ఈ అంశం ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు. కాపు సమ్మేళనంలోనే శ్రీనివాస్ పరిచయం అయ్యాడని, అంతకు మించి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement