Friday, April 26, 2024

వివాహ వేడుకల్లో విషాదఛాయలు.. వివాహానికి వెళ్తుండగా అదుపు తప్పి వాహనం పల్టి..

మోపిదేవి (కృష్ణా) ప్రభ న్యూస్‌ పెళ్లికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన గురువారం చోటు-చేసుకుంది. ఒంగోలు – కత్తిపూడి జాతీయ రహదారి 216 (ఎ) పై చల్లపల్లి మోపిదేవి మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే వివాహ కార్యక్రమానికి మహేంద్ర ట్రక్‌ వాహనంలో సుమారు 25 మంది వరకు వెళ్తున్న క్రమంలో కాసానగరం వద్ద అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం విజయ (40), కోన వెంకటేష్‌ (70), బూరెపల్లి కోటేశ్వరమ్మ (55), బూరెపల్లి రమణ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తుల పరిస్థితి విషయంగా ఉండటంతో వారిని మచిలీపట్నం నుంచి విజయవాడ తరలిస్తుండగా, ఎం.మాధవ రావు (65) మార్గమధ్యలో మృతి చెందారు. మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 15 మందిని చికిత్సనిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వీరంతా ఒకే గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి వారు ఆటో ట్రాలీలో చింతలమడ గ్రామం నుండి పెదప్రోలుకు బయలుదేరారు.

చల్లపల్లి దాటి కాసా నగరం జాతీయ రహదారి వద్ద ఆటో ట్రాలీ అదుపుతప్పి పల్టీలుకొట్టింది. మరణించిన ఐదుగురు వ్యవసాయ కూలీలు. కాగా ఈ సంఘటన ప్రాంతాన్ని అవనిగడ్డ డీఎస్పి మెహబూబ్‌ బాషా, సిఐ జి.శ్రీనివాస్‌, ఎస్‌ఐ సందీప్‌, మురళీకృష్ణలు పరిశీలించారు. మృతి చెందిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను 108 ద్వారా రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు , స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రవాణా శాఖ మచిలీపట్నం అధికారి సీతాపతి పరిశీలించారు. సంఘటన స్థలాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, దివి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ- చైర్మన్‌ కడవ కొల్లు నరసింహారావులు పరిశీలించి, డిఎస్పిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలోనూ, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి లోనూ ఉన్న క్షతగాత్రులను పరామర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement