Friday, April 19, 2024

Big Story: పోడు భూములకు పట్టాలు.. సిద్దమవుతున్న హక్కు పత్రాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోడు భూముల సమస్యల పరిష్కారం తుది దశకు చేరింది. దరఖాస్తుల వడపోతతో అధికారులు బిజీగా ఉన్నారు. దరఖాస్తుల పరిశీలనతోపాటు, క్షేత్రస్థాయిలో అధికారుల సర్వేకు ఈ నెలాఖరు గడువుగా నిర్దేశించిన నేపథ్యంలో కమిటీలు, అధికారులు వేగంగా కసరత్తు పూర్తి చేస్తున్నారు. పలు గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ దిశగా వేచిచూస్తున్న అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారంనుంచి పలు గ్రామాల్లో సర్వే పూర్తిచేసి గ్రామసభల ద్వారా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించారు.

గ్రామ సభల్లో లబ్దిదారుల వాస్తవితక, పోడు పట్టాలకు అర్హమైనవి, భూముల వివరాలు, సామాజిక, ఆర్ధిక స్థితిగతులను పరిశీలించి, నివేదిక రూపంలో క్రోఢీకరించి గ్రామ సభల తీర్మానాలతో డివిజన్‌, జిల్లా కమిటీలకు చేరవేయనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన, అటవీ, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీలు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే నెలలో పోడు రైతులకు పట్టాలను అందించి పోడు భూములపై శాశ్వత హక్కుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 13.18లక్షల ఎకరాల పోడు భూములకు చెందిన రైతులకు 2021 నవంబర్‌ 8నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఈ సందర్భంగా 2450 గిరిజన గ్రామాల్లో పోడు భూముల సమస్యలున్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. నవంబర్‌లో దరఖాస్తుల ప్రక్రియ పూర్తవడంతో లబ్దిదారుల గుర్తింపు కార్యాచరణ జరుగుతోంది. అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం 6లక్షల ఎకరాలకు చెందిన భూములపై దరఖాస్తులు వస్తాయని భావించగా అత్యధికంగా 13.18లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హత కల్గిన దరఖాస్తుల సంఖ్య 3.5లక్షలుగా గుర్తించారు.

ఇక తుది విడతలో అటవీ హక్కుల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు పరిశీలించిన తర్వాత గ్రామ సభల ద్వారా వచ్చిన జాబితాలను డివిజనల్‌ స్థాయి కమిటీలు పరిశీలిస్తాయి. ఈ కమిటీలో అర్హత తేల్చిన తర్వాతే జిల్లా కమిటీలకు పంపనున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు మరోసారి ఆయా విజ్ఞప్తులను అసాంతం పరిశీలించి వాటిని ఆమోదించడమో, తిరస్కరించడమో చేసిన వెంటనే అర్హులకు పోడు పట్టాలు అందించనున్నారు. ఆయా భూములకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు అందించనున్నారు.

ఇలా పోడు భూములపై హక్కులు కోరుతూ దాఖలైన ఒక్కో అర్హులైన దరఖాస్తుదారుకు సగటుగా రెండున్నర ఎకరాలను కేటాయించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95వేల ఎకరాల్లో పోడు భూమి సాగులో ఉందని నివేదికలు చెబుతున్నాయి. నిత్యం ఈ భూములపై రైతులు, అటవీ అధికారుల మధ్య రావణకాష్టం రగులుతూనే ఉంది. వరంగల్‌ జిల్లాలో లక్షా 9వేల ఎకరాల్లో పోడు భూములున్నాయని అవీ శాఖ అధికారులు అంచనా వేశారు. వాటిని స్వాధీనపర్చుకునేందుకు అటవీ శాఖ విఫలయత్నాలు చేసింది. వీటిపై అనేక ఏళ్లుగా వివాదం పెండింగ్‌లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట, కొండపల్లి, బజార్‌హత్నూర్‌, పెంబి తదితర ప్రాంతాల్లో నిత్యం అగ్గి రాజుకుంటూనే ఉన్నది.

ఈ జిల్లాలో 56,358మంది పోడు రైతులు హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 37,372మంది దరఖాస్తులను గ్రామ సభలు ఆమోదించాయి. మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ రైరల్‌ జిల్లాల్లో పోడు భూముల వివాదం నానాటికీ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 3వ వారంనుంచి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు దరఖాస్తులను స్వీకరించారు. అటవీ సరిహద్దుల కో ఆర్డినేట్స్‌, కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం వంటి చర్యలు విజయవంతం కావడంతో పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement