Saturday, December 7, 2024

Shame: గిరిజన బాలికకు టార్చర్​.. నాలుకతో టాయిలెట్ క్లీన్​ చేయించిన బీజేపీ మహిళా నేత​

తానొక మాజీ ఐఏఎస్​ ఆఫీసర్​ భార్య.. పైగా బీజేపీలో ప్రజా ప్రతినిధి. అయితే ఆమె వికృత చేష్టలకు ఓ బాలిక ఎన్నో చిత్రహింసలకు గురయ్యింది. ఈ విషయం బయటికి తెలియకుండా ఆ బాలికను గదిలో బంధించేవారు. వాళ్లు కొట్టే దెబ్బలను తాళలేక ఆ బాలిక దుస్తుల్లోనే మూత్రం పోసుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా వదలకుండా చిత్రహింసలు పెట్టేవారు. వారి చేష్టలు ఎంతదాకా వెళ్లాయంటే ఆ బాలికను చిత్రహింసలు పెట్టినప్పుడు భయంతో బట్టల్లోనే యూరిన్​ పోసుకుంటే ఆ ప్రదేశాన్ని ఆ బాలిక నాలుకతోనే తుడిపించేవారు. ఇంతటి కఠినాత్ములు బీజేపీ పార్టీలో నేతలుగా ఉన్నారన్నది ఈ ఘటనతో స్పష్టమవుతోంది. దీనిపై సోషల్​ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్​ జరుగుతోంది.

‌– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్​ పాత్ర ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆయన భార్య సీమా పాత్రా ఓ గిరిజన బాలికను బలవంతంగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. చీటికీ మాటికీ చిత్రహింసలకు గురిచేసేవారు. తన ఇంట్లో పనిచేస్తున్న ఆ గిరిజన బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఆరోపణలపై ఇవ్వాల తెల్లవారుజామున రాంచీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.

తొలుత అరెస్టుకు భయపడిన సీమా పాత్రా పోలీసులకు దొరక్కుండా పరారయ్యారు. ఆమె కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోని పనిమనిషి సునీత నాలికతో టాయిలెట్‌ను శుభ్రం చేయించినట్టు సీమా పాత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాక, సునీత శరీరం నిండా గాయాలున్నాయి. సీమ తన శరీరాన్ని వేడి వస్తువులతో కాల్చేవారని సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం గిరిజన బాలిక చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్రా భార్య అయిన సీమా పాత్రాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 164 కింద మంగళవారం సునీత వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేశారు. కాగా, పనిమనిషిపై అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా చిత్ర హింసలకు గురిచేసిన వార్తలు వెలుగులోకి రావడంతో ఝార్ఖండ్ బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. పని మనిషిని సీమా చిత్రహింసలకు గురిచేసిన వార్తలపై తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆమెను అరెస్ట్ చేయాలని ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement