Thursday, April 25, 2024

వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతల భేటీ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఆయన అభిప్రాయానికి ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉపరాష్ట్రపతిగా ఉన్న ఉషాపతి ఎం. వెంకయ్య నాయుడు తదుపరి భవితవ్యం ఏంటదన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రపతిగా అవకాశాలు లేవని తేలిపోవడంతో ఉపరాష్ట్రపతిగానైనా కొనసాగేనా అన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ. రాష్ట్రపతి రేసులో ఆయన పేరు వినిపించినప్పటికీ మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయనకు అవకాశం లేదని తేలిపోయింది. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమవడానికి ముందు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం వచ్చి వెంకయ్య నాయుడును కలవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన అనంతరం జరిగిన ఈ భేటీలో అధికార కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థి అంశంపైనే చర్చించినట్టు తెలిసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారు.

రాజ్‌నాథ్ సింగ్ సమావేశం ప్రారంభమైన కాసేపటి తర్వాత వెళ్లిపోగా మిగతా నేతలిద్దరూ దాదాపు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. నిజానికి ఈ భేటీ గురించి సోమవారమే వెంకయ్య నాయుడుకు తెలియపరిచారు. ముందుగా అనుకున్న ప్రకారం బుధవారం వరకు హైదరాబాద్‌లో ఉండాలనుకున్న వెంకయ్య నాయుడు, మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే మిగతా కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగొచ్చేశారు. ఆ వెంటనే బీజేపీ అధిష్టానం ఆయనతో భేటీ అయింది. భేటీ నేపథ్యంలో వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి.

రాష్ట్రపతి అభ్యర్థి అంటూ ప్రచారం!
బీజేపీ అగ్రనేతల భేటీ వెనుక కారణం రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఎంపికచేయడమేనన్న ప్రచారం మొదట ఊపందుకుంది. లేనిపక్షంలో ముగ్గురు అగ్రనేతలు ఆయన్ను ఎందుకు కలుస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కమలనాధులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేదు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగానూ లేని పరిస్థితి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొంది.

ఈ క్రమంలో వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఊతమిస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. పైగా వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మద్ధతు లభిస్తుందని కమలనాథులు వ్యూహాలు రచించినట్టు కొందరు పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల నుంచి కూడా వెంకయ్య నాయుడుకు మద్ధతు లభించే అవకాశాలున్నాయని సూత్రీకరించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే వరకు ఈ చర్చ విస్తృతంగా సాగింది.

- Advertisement -

ఉపరాష్ట్రపతిగానే కొనసాగింపు?
రాష్ట్రపతిగా అవకాశం లేదని తేలిపోవడంతో ఇప్పుడు వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగానే కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇందుక్కారణం రాజ్యసభను సజావుగా నడిపించగలిగే హెడ్‌మాస్టర్ తరహా నేత అవసరమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడు తిరుగులేని పనితీరును ప్రదర్శించారని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక బిల్లులు రాజ్యసభ వరకు వచ్చి ఆగిపోయాయి.

వాటిని పాస్ చేయాలన్నా, విపక్షాల నిరసనల మధ్య సభను సజావుగా నిర్వహించాలన్నా సుదీర్ఘ రాజకీయానుభవం, అన్ని పార్టీల్లోనూ పలుకుబడి కలిగిన వెంకయ్య నాయుడే సరైనవాడన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆయన ఆశించినా.. ఇతర సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోతున్నామని, ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తామని చెప్పడానికే బీజేపీ అధిష్టానానికి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు వచ్చి మాట్లాడినట్టు మరో కథనం వినిపిస్తోంది. దీంతో ఉపరాష్ట్రపతిగానైనా ఆయనకు మరోసారి అవకాశమిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

వీడ్కోలు!
ఒకవేళ ఉపరాష్ట్రపతిగానూ కొనసాగించనిపక్షంలో వెంకయ్య నాయుడుకు రాజ్యాంగ పదవి నుంచి వీడ్కోలు పలికినట్టే. ఇన్నాళ్లుగా పార్టీకి, రాజ్యాంగ పదవిలో దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ ఆయనకు మర్యాదపూర్వకంగా సెలవు పలకడానికే బీజేపీ అగ్రనేతలు ఆయనతో సమావేశమయ్యారన్నది మరో కథనం. అలాగే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనా ఆయనతో చర్చించి, ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారని తెలుస్తోంది. ద్రౌపది ముర్ము ఎంపిక విషయం ఆయనతో చర్చించిన తర్వాతనే ఆమె పేరును బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఖరారు చేశారని సమాచారం.

పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కంటే ముందు వెంకయ్య నాయుడుతో భేటీ జరపడం ఇందుకోసమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్య నాయుణ్ణి క్రియాశీల రాజకీయాల నుంచి రాజ్యాంగ పదవిలోకి పంపించిన బీజేపీ అధిష్టానం, తదుపరి ఆయన్ను ఏస్థానంలో కూర్చోబెడతారన్నది ఆసక్తకరంగా మారింది. ఎల్కే అడ్వాణీ తరహాలో మార్గదర్శక మండలిలో భాగం చేస్తారా లేక, మరేదైనా బాధ్యత అప్పగిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement