Friday, March 29, 2024

టమాటకు రెక్కలు.. మార్కెట్‌లో కిలోకు రూ.40 పైనే

మర్కుక్‌, ప్రభన్యూస్ : టమాట గత నెల వరకు కొనే నాథుడే రాలేదు. దీనికి తోడు అధిక పంట ఒకేసారి మార్కెట్‌లోకి రావడంతో ధర లేక చేతికొచ్చిన పంటను రైతులు రోడ్లపైనే పారబోశారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అనూహ్యంగా కిలో టమాట రూ.40 పైనే పలుకుతుంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని ములుగు, వరంగ‌ల్, మర్కుక్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట, తుర్కపల్లి మండలాలలో టమాట పంట లభ్యత ఇప్పుడు ఉంది. అక్కడి నుండి పంటను వంటిమామిడి కూరగాయల మార్కెట్‌లోకి విరివిగా వస్తుంది. వివాహాలు తదితర కార్యక్రమాలు అధికంగా ఉండడంతో పాటు ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకునే సమయం కావడంతో టమాటకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో రైతుబజార్‌లో, బహిరంగ మార్కెట్‌లలో టమాట రూ.40కి పైగా విక్రయిస్తున్నారు. వేసవి ఎండల తీవ్రతకు పంటలు ఎండిపోతున్నాయి.

గతనెల సిద్దిపేట జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి టమాట విరివిగా పండించేవారు. పంట కాలపరిమితి ముగియడంతో టమాట చేళ్ళు తొలగించారు. దీంతో టమాట పంటకు అదునుగా ఉండే ములుగు, వరంగ‌ల్, తుర్కపల్లి ప్రాంతాల నుంచి టమాట ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాంతాల్లో పాలిహౌజ్‌ ద్వారా పండించే పంట కూడా అత్యంత నాణ్యతగా మార్కెట్‌లోకి వస్తుంది. పాలిహౌజ్‌ ద్వారా పండించే పంటకు పెట్టుబడి ఖర్చుతో పాటు శ్రమ కూడా అధికం. ఈ పరిణామాలు కూడా టమాట ధర పెరుగుదలకు కారణం. దీనికి తోడు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో టమాట ధరలు అకస్మాత్తుగా పెరిగాయని, మార్కెటింగ్‌ శాఖ, రైతుబజార్‌ అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement