Friday, March 29, 2024

సెంచరీ కొట్టనున్న టమాట ధర.. మార్కెట్‌లో కిలో 70కి పైనే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టమాట ధర మళ్లీ కొండెక్కింది. సెంచరీ కొట్టే దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లలో కిలో టమాట ధర రూ.65 నుంచి రూ.70గా పలుకుతోంది. రైతు బజార్లో రూ.60కి కిలో టమాట దొరుకుతుండగా బయటి మార్కెట్లలో రూ.10 నుంచి రూ.20 దాకా అదనంగా వినియోగదారులు చెల్లిస్తున్నారు. టమాట ధరలు మండిపోతుండడంతో కొనేదెలా ..? అని వినియోగదారులు వాపోతున్నారు. ధర పెరగక ముందు 2 నుంచి 3 కిలోలు కొనేవారు ఇప్పుడు అరకిలో, ఒక కిలో కొనుగోలుకు మాత్రమే పరిమితమవుతున్నారు. కొందరైతే తాత్కాలికంగా వంటల్లో టమాట వినియోగాన్ని మానేశారు. మిగతా కూరగాయల ధరల మాదిరిగానే ఇప్పుడు టమాట ధర కూడా సామాన్యుడికి అందనంటోంది. పది రోజుల వ్యవథిలోనే కిలో టమాట ధర రూ.50 మేర పెరిగింది.

గతేడాది రైతులు టమాట సాగును పెద్ద ఎత్తున చేయడంతో కిలో టమాట రూ.2 నుంచి రూ.5కే పరిమితమైంది. దీంతో ఈ ఏడాది రైతులు టమాట సాగును బాగా తగ్గించారు. సాధారణంగా ఎండా కాలంలో టమాట దిగుబడి భారీగా తగ్గుతుంది. మరోవైపు రెండేళ్లుగా ధర రాకపోవడంతో రైతులు టమాట సాగును తగ్గించారు. ఫలితంగా ఈ ఏడాది కూడా టమాట ధరలు తక్కువగానే ఉంటాయని భయపడ్డ రైతులు సాగును తగ్గించారు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి టమాట దిగుమతులు తగ్గిపోవడం, అకాల వర్షాలకు పంట దెబ్బతినడం కారణంగా టమాట ధర భారీగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు అంటే జూన్‌ నెలాఖరు వరకు వంటింట్లో టమాట కనిపించడం కష్టంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement