Saturday, April 20, 2024

నేటి సంపాదకీయం-త‌గ్గిన వ‌ల‌స‌లు..

స‌మైక్య ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. వీటిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేది. ఇందుకు కారణం తెలంగాణలో వ్యవసాయం బోర్‌ల పై ఆధారపడి సాగేది. సాగునీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల అందరూ బోరు బావులు తవ్వించి వాటి నీటితో వ్యవసాయం చేసేవారు. దాంతోరైతులు అప్పులు పాలు కావడం, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడటం సర్వసాధారణంగా ఉండేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించడంతో బోరుబావుల పై ఆధారపడటం తగ్గింది. అంతేకాక, వ్యవసాయ పనులు లేక తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వ్యవసాయ కూలీలు వలస వెళ్ళేవారు. ఇప్పుడు వలసలు తగ్గడం వల్ల రైతులు, వ్యవసాయకూలీలు తమ గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. అంతేకాక, ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న అన్నపూర్ణ నామకరణాన్ని ఇప్పుడు తెలంగాణ చేజిక్కించుకుంది. అధికంగా పండించడం వల్లనే అన్నపూర్ణగా తెలంగాణ పేరు మారుమోగుతోంది.

అయితే, అది కూడాఒక చిక్కులా పరిణమించింది. అధికంగా పండించిన వరిని కొనేవారు లేక ధాన్యం రాశులు పొలాల్లోనే ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. స్వస్థలాన్ని వదిలి విదేశాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా అవి వలసలే. విదేశాలకు వలసలకు వెళ్ళేవారిలో తెలంగాణ ప్రాంతం వారే అధికంగా ఉండేవారు. గల్ఫ్‌ బాధితులు ఎక్కువగా తెలంగాణలోనే ఉండేవారు. ఇప్పుడు గల్ఫ్‌ బాధితుల గోస ఎక్కువగా వినిపించడం లేదు. అంతమాత్రాన ఆ సమస్య పూర్తిగా నిర్మూలైనట్టు కాదు. ఇప్పటికీ విదేశాల్లో బాగా డబ్బు సంపాదించుకోవచ్చని కువైట్‌, దుబాయ్‌ వంటి గల్ఫ్‌ దేశాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు. అలా వెళ్ళేవారిలో ఆంధ్రప్రాంతంవారు కూడాఉన్నారు. అయితే, స్థానికంగా పనులు దొరికితే వలసలు వెళ్ళే అవసరం ఉండదని ఇప్పుడు రుజువు అవుతోంది. వలసలు ఒక్క తెలంగాణకే కాకుండా బీహార్‌, ఒడిషా, జార్ఖండ్‌ వంటిరాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్‌ వంటి మహానగరాలో జరిగే భవన నిర్మాణ కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. వలసలను అరికట్టేందుకు కోవిడ్‌ మొదటి దశ సమయంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో కొంత భాగాన్ని కేటాయించారు.

అలాగే, వలస కార్మికులు ఎక్కడైనా రేషన్‌ పొందేందుకు సరఫరా కార్డును ఇస్తున్నా మని ప్రభుత్వం ప్రకటించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కుదించి చివరిగా నాలుగు చట్టాలను ఖరారు చేసింది. ఈ చట్టాల వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు తరచూ ఆరోపిస్తున్నారు. ఈ చట్టాల్లో వలసల నిరోధక చట్టం కూడా ఉంది. వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక పోయిందన్న సామెత చందంగా తయారైంది. కార్మికరంగం పట్ల మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ తరచూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే, స్వస్థలంలో పని దొరకకపోతే గల్ఫ్‌తో సహా పలు విదేశాలకు వలసలు వెళ్ళేవారు. కానీ, గత రెండేళ్ళుగా కరోనా, ఇప్పుడు ఒమిక్రాన్‌ వ్యాప్తికారణంగా విదేశాలకు వలస వెళ్ళేకార్మికుల సంఖ్య తగ్గింది. అదే సందర్భంలో తెలంగాణలో సొంతఊళ్ళో పనులు దొరకుతుండటంవల్ల విదేశాలకువెళ్ళే వారి సంఖ్య తగ్గుతోంది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత పెరిగితే అంత దేశానికి లాభం. ఈ విషయం కేంద్రంకు తెలియంది కాదు. రాజకీయాల కారణంగా ధాన్యం కొనుగోలు అంశంపై రగడ జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడావాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నందున సమస్య సమసిపోవచ్చు. అభివృద్ధి అనే పదానికి అర్థం ఉత్పత్తి పెరగడమే. పారిశ్రామికాభివృద్ది విషయంలో కేంద్రం ఎంతో శ్రద్ద తీసుకుంటున్నప్పటికీ కొన్ని ముఖ్యమైన ఉపకరణాలను దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. పారిశ్రామిక రంగంలో చిన్న, మధ్యతరగతి కుటీర పరిశ్రమల సంఖ్య పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్టార్ట్‌ అప్‌ల వల్ల భారత్‌లో ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement