Friday, April 19, 2024

నేటి సంపాదకీయం-రిజర్వేషన్లతోనే సాధికారత!

యువతీయువకుల మధ్య సమానత్వాన్ని పాటించడం కోసమే యువతుల పెళ్ళీడు వయసును 21 సంవత్సరాలకు పెంచాలన్న బిల్లును తీసుకువస్తున్నట్టు ప్రభుత్వంచెబుతోంది. సమానత్వం అనేది కేవలం పెళ్ళీడు వయసులో మాత్రమే కాదు, చట్టసభల్లో అవకాశాల విషయంలో కూడా చూపిస్తే ప్రభుత్వం నిజాయితీని మహిళలు నమ్మగలరని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఆ బిల్లును గురించి పట్టించుకోవడం లేదు. మహిళా సాధికారత కోసమే చట్టసభల్లో 33శాతంరిజర్వేషన్లు కోరుతున్నామని మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల శారీరక సౌష్టవాన్ని పెంచడానికి వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి. చిన్నవయసులో పెళ్ళి చేయడం వల్లనే రక్తహీనత సమస్య ఎదురవుతోందన్నది వాటి నిశ్చితాభిప్రాయం. ముఖ్యంగా, పోషక విలువలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, పానీయాలు అందుబాటులో లేకపోవడం ముఖ్యకారణం.

మహిళల పోషకాహార బాధ్యతను ప్రభుత్వాలు తీసుకుంటే రక్త హీనతను, శిశు మరణాల రేటును అరికట్టవచ్చని మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రసవ సమయాల్లో మహిళలకు సరైన మందులు, పోషకాహారాలు ఉండే టానిక్‌లు అందుబాటులో ఉండటం లేదు. వాటిని ప్రభుత్వం సరఫరా చేసేట్టు చూడాలి. దీని వల్ల ప్రసవ మరణాలను అరికట్టేందుకు వీలుంటుంది. గర్భిణి స్త్రీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలను ప్రభు త్వాలు చేస్తున్న దాఖలాలు లేవు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఈ విషయమై చొరవ తీసుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అవి కూడా ప్రచార పటాటోపానికే పరిమితం అవుతున్నాయి. ఇందుకు పూర్తిగా ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం లేదు. దేశంలో పౌష్టి కాహార సరఫరా కార్యక్రమాలు పలు రాష్ట్రాల్లో సాగుతున్నాయి. వీటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నాయి. అయితే, నిర్వాహకుల ఉదాసీనత వల్ల ఈ కార్యక్రమాలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.

మధ్యాహ్న భోజన పథకంపై వస్తున్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఇందుకు పూర్తిగా ప్రభుత్వాలనే నిందించడం సరి కాదు. సిబ్బందిలో మార్పు రావాలి. ఈ నాటి బాలికల్లో విషయ పరిజ్ఞానంపై ఆసక్తి మెండుగా ఉంటోంది. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని సులభంగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానంలో ప్రావీణ్యాన్ని పెంచే కార్యక్రమాలు అమలు జేయాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనిదే ఉద్యోగాలలో అవకాశాలు లభించడం లేదు. ఆ విషయాన్ని గుర్తులో ఉంచుకుని బాలికలు వృత్తి విద్యల్లో ఆరితేరేట్టు వారికి చేయూతనివ్వాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే ఏ మంచి కార్యక్రమానికి అయినా తూట్లు పొడిచే వారుంటారు. అటువంటి వారిని కనిపెట్టిఉండాలి. ఆడవారు ఇప్పుడు కోరుతున్నది విద్యా, ఆర్ధిక రంగాల్లో సమానత్వం. విద్యారంగంలో రాణించినప్పుడే ఆర్థిక రంగంలో సమానత్వాన్ని సాధించడానికి వీలుంటుంది. అందుకే పెళ్ళిపై కన్నా, ఉద్యోగాల పట్ల ఈ కాలపు ఆడపిల్లలు ఆసక్తిని కనబరు స్తున్నారు. సమాన హక్కుల సాధనకు చట్టసభల్లో రిజర్వేషన్లే శరణ్యమని వారు బలంగా విశ్వసిస్తున్నారు.

మహిళల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పార్టీల ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల్లో మహిళల్లో అక్షరా స్యులు బాగా తక్కువ. అందువల్ల ఈ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని అగ్రవర్ణాల వారే ఉపయో గించుకుంటారన్న అనుమానంతో ఈ పార్టీలు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లలో వెనకబడిన తరగతుల మహిళలకు 20 శాతం కేటాయించాలని ఈ పార్టీలు కోరుతున్నాయి. రిజర్వేషన్ల లో వర్గీకరణ అంశం తేనెతుట్టె వంటిది. దానిని కదిలిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకు షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్‌ పోరాటాలే నిదర్శనం. మహిళా రిజర్వేషన్లలో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకుండా చట్టసభల్లో 33 శాతం వారికి దక్కేట్టు చూడాలి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement