Friday, May 20, 2022

నేటి సంపాదకీయం – సవాళ్ల మధ్య బిడెన్‌!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ పదవీ బాధ్యతలను స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ, తన పాలపై ప్రజల్లో నిరాశా నిస్పృహలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. బహుళజాతుల సమాహారమైన అమెరికన్‌ సమాజంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడం ఒక ఏడాదిలో సాధ్యమయ్యే విషయం కాని మాట నిజమే. మామూలు పరిస్థితుల్లోనే ఊహించని సమస్యలు ఎదురవుతున్నప్పుడు కరోనా వంటి మహమ్మారి వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడంలో బిడెన్‌ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ సేవలను ఆయన ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు కూడావస్తున్నాయి. ఆమె కొంత అసంతృప్తితో ఉన్న విషయం ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టం అయింది. అయితే, బిడెన్‌ మాత్రం దీనిని కొట్టి వేశారు. కమలా హ్యారీస్‌ బాగా పని చేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో తనకు రన్నింగ్‌ మేట్‌ ఆమేనని స్పష్టం చేశారు. అయితే, కమలాహ్యారీస్‌కి 44 శాతం మంది మద్దతు మాత్రమే లభిస్తోంది. ఆమెపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరక పోవడానికి వైట్‌ హౌస్‌ నుంచి సరైన సహకారం లేకపోవడమేనని ఆమె అనుచరులే కాకుండా ఇతరులు సైతం అంగీకరిస్తున్నారు. కమలాహ్యారీస్‌ సలహాలను తీసుకోకపోవడం వల్లనే బిడెన్‌ తన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బిడెన్‌ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాల్లో అఎn్గానిస్తాన్‌ నుంచి సంకీర్ణ సేనలను ఉపసంహరించాలన్నది ముఖ్యమైనది.

దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. అఫ్గాన్‌లో సంకీర్ణ సేనల కొనసాగింపు అమెరికాకు మోయలేని భారంగా తయారైంది. ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని తొలగించి నందుకు హర్షం వ్యక్తం చేసిన వారున్నట్టే, ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని విమర్శించిన వారూ ఉన్నారు. బిడెన్‌ అధికారంలోకి వచ్చేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న మాట నిజమే. ట్రంప్‌ హయాంలో ఖర్చులు పెరిగాయి. వాణిజ్యం విషయంలో చైనాతో పోటీ పడినప్పటికీ ఆయన యత్నాలు ఫలించలేదు. బిడెన్‌ ఈ విషయంలోఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే, చైనాతో ముఖ్యమైన అంశాలలో కరకుగానే వ్యవహరిస్తున్నారు. తైవాన్‌ విషయమే ఇందుకు నిదర్శనం. తైవాన్‌లో అమెరికా జోక్యాన్ని సహించబో మంటూ చైనా హెచ్చరించినా ఆయన లక్ష్య పెట్టలేదు. అలాగే, దక్షిణ చైనా సముద్ర ప్రాంతం లో చైనా దూకుడును ప్రశ్నించడమే కాకుండా, వియత్నాం, బహరైన్‌ వంటి దేశాలకు అభయం ఇవ్వడం బిడెన్‌ విదేశాంగ విధానంలో గుణాత్మకమైన మార్పును సూచిస్తోంది. ఆర్థికరంగంలో బిడెన్‌ తమ పార్టీ ప్రణాళిక ప్రకారం ముందడుగు వేయలేకపోవడానికి కరోనాయే కారణం. కరోనా తన ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలిచిందని ఆయనే అంటున్నారు. దేశంలో 61 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది. నిర్ధారణ పరీక్షలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. కోవిడ్‌ చికిత్సలకు సరైన వైద్య సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

కోవిడ్‌ కేసుల వల్ల ప్రజ లను కలుసుకోలేకపోతున్నట్టు బిడెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావం వల్ల చేయదల్చుకున్నవి చేయలేకపోతున్నట్టు ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో పరిస్థితి ఇప్పుడున్న స్థితిని ఆసరగా చేసుకునే చైనా దూకుడు పెంచిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లతో కలిసి క్వాడ్‌ కూటమి ఏర్పాటులో బిడెన్‌ చొరవ చూపారు. బిడెన్‌ పాలనపై పెదవి విరిచేవారు, ఆయన సమర్ధవంతంగా వ్యవహరించకపోవడం వల్లనే చైనా నుంచి క్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. అయితే, బిడెన్‌ ట్రంప్‌ మాదిరిగా మాటలకు కాకుండా చేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనాను ఎదుర్కొనేటందుకు ఆయన మదిలో స్పష్టమైన ప్రణాళిక ఉందని అనుచరులు అంటున్నారు. దేశంలోపల, వెలుపల ఎదురవుతున్న విమర్శల నేపధ్యంలో మధ్యంతర ఎన్నికలు తప్పవేమోనన్న ఊహాగానా లు వ్యాపిస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు మరింత సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని భావిస్తున్నవారున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement