Friday, April 26, 2024

ఇవ్వాలే బెంగళూరుకు సీఎం కేసీఆర్​.. ప్రధాని పర్యటనకు మరోసారి దూరం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాల ప్ర‌త్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడతో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరుతారు. దేవెగౌడ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ అవుతారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్… అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌.. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ వెంట గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా కర్నాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. కేసీఆర్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.

​ప్రధాని పర్యటనకు దూరం:
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఇవ్వాల‌ మోదీ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. కాగా, సీఎం హైద‌రాబాద్‌లో ఉండ‌డం లేదు. దీనికి ముందే ఆయ‌న ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు జ‌రిగాయి. అందుక‌ని సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఆరోజు సీఎం కేసీఆర్‌ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదు. తాను హాజరు కావాలనుకున్నా వద్దనడంతో వెళ్లలేదని సీఎం దీనిపై అప్పట్లో వివరణ ఇచ్చారు.

ఇక‌… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారని అప్పట్లో టీఆర్ ఎస్ పార్టీ విమర్శించగా.. కేసీఆర్‌ వైఖరిపై బీజేపీ ధ్వజమెత్తింది. గత ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలోనూ సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌కుండా దూరంగా ఉన్నారు. అప్ప‌ట్లో జ్వరం కారణంగా ఆ ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రు కాలేద‌ని కేసీఆర్‌ తెలిపారు. దీనిపైనా టీఆర్ెస్‌, బీజేపీ నేత‌ల‌ మధ్య మాటల యుద్ధం నడచింది. మ‌ళ్లీ ఇప్పుడు ఐఎస్‌బీ సమావేశం గత వారం ఖరారయింది. ఇదే సమయంలో సీఎం ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల సందర్శనకు బయల్దేరారు. ఈ క్రమంలో ప్రధాని, సీఎంలు ఈ పర్యటనలోనూ కలిసే అవకాశం లేకుండాపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement