Monday, March 25, 2024

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు.. భారీగా గ్యాస్‌ దిగుమతులు

ఈ సారి వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. దీని వల్ల విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరగనున్న డిమాండ్‌ను అందుకునేందుకు, విద్యుత్‌ కోతలను తగ్గించేందుకు ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. ఇందుకు గ్యాస్‌ దిగుమతులు పెంచుకోవాలని నిర్ణయించింది. గెయిల్‌ ఇండియా గ్యాస్‌ను దిగుమతి చేసుకుని ప్రభుత్వ రంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీకి సరఫరా చేయనుంది. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్లాంట్ల ద్వారా 5 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌టీపీసీని కోరింది.

ఈ వేసవిలో ప్రధానంగా ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ ఉత్పత్తి కాకుంటే, తప్పనిసరిగా విద్యుత్‌ కోతలు విధించాల్సి వస్తుంది. గత వేసవిలో అనేక రాష్ట్రాల్లో గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధించాల్సి వచ్చింది.

- Advertisement -

ఏప్రిల్‌, మే నెలల్లో 250 మిలియన్‌ మెట్రిన్‌ స్టాండర్డ్‌

క్యూబిక్‌ మీటర్స్‌ గ్యాస్‌ అవసరం అవుతుందని ఎన్‌టీపీసీ అంచనా వేసింది. ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే 4 గిగా వాట్స్‌ విద్యుత్‌ను కూడా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచనున్నారు. వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ తగినంత సరఫరా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఒక ఉన్నతాధికారి చెప్పారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల మొత్తం సామర్ధ్యం 25 గిగావాట్లగా ఉంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోలేదు. థర్మల్‌, జల విద్యుత్‌తో పోల్చితే గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల యూనిట్‌ రేటు పెరుగుతుంది. వేసవిలో జల విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ పెంచాలని కేంద్రం నిర్ణయించింది. వేసవిలో ఉత్పత్తి పెంచేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు, గ్యాస్‌తో నడిచే ప్లాంట్లు ఎక్కువ రేటుకు విద్యుత్‌ను విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇం డియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ ఈ ఆదేశాల ప్రకారం యూనిట్‌ 50 రూపాయలకు విక్రయించుకునేందుకు ఇలాంటి కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఎన్‌టీపీసీ గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లకు గెయిల్‌ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య దీర్ఘకాల సరఫరా ఒప్పందం ఉంది. ఈ వేసవిలో ఎన్‌టీపీసీ డిమాండ్‌కు తగినంత ఎల్‌ఎన్‌ జీని సరఫరా చేయాలని గెయిల్‌ నిర్ణయించింది.

మన దేశంలో ఎల్‌ఎన్‌జీ ప్రధానంగా విద్యుత్‌ ఉత్పత్తితో పాటు, ఎరువుల తయారీ కార్మాగారాల్లోనూ, వాహనాలను నడిపించేందుకు వినియోగిస్తున్నారు. ఈ జనవరిలో ముగిసిన 10 నెలల ఆర్ధిక సంవత్సరంలో అధిక రేట్ల మూలంగా ఎల్‌ఎన్‌జీ దిగుమతులు 14 శాతం తగ్గాయి. ప్రస్తుతం గ్యాస్‌ రేట్లు తగ్గాయని, వేసవిలో డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున దిగుమతులు పెరుగుతాయని ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్ఛేంజ్‌ సీఈఓ రాజేష్‌ మెడిరట్టా అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement