Saturday, April 20, 2024

Delhi | న్యాయమూర్తుల నియామకాల్లో సోషల్ జస్టిస్ లేదు.. సుప్రీంకు తెలంగాణ బార్ అసోసియేషన్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత లేదని తెలంగాణ బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ విషయంపై బార్ అసోసియేషన్ నేతలు బుధవారం ఢిల్లీలో భారత ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు కొలీజియంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అసోసియేషన్ ప్రతినిధి రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియంకు పంపిన పేర్లను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ తీర్మానం కూడా చేసిందని చెప్పారు.

హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఐదుగురి పేర్లను కొలీజియం పరిశీలనకు పంపిస్తే.. అందులో హైకోర్టులో ప్రాక్టీస్ చేయనివారే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడినవారికి నియామకాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొలీజియం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అన్న అనుమానం కల్గుతోందని చెప్పారు. నియామకాల్లో సామాజిక న్యాయం జరగడంలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కూర్చుని జాబితా తయారు చేస్తామంటే ఎలా అంటూ రఘునాథ్ ప్రశ్నించారు. బార్ అసోసియేషన్ తీర్మానాన్ని, సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement