Monday, April 15, 2024

విశాఖపట్నం మెట్రో రైలు ప్రతిపాదన లేదు.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంకు ఎంతో ఉపయోగకరమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ రాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విశాఖ రైలు ప్రాజెక్టుపై ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం సమాధానమిచ్చారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆయన లిఖితపూర్వకంగా బదులిచ్చారు. మెట్రో రైలు పాలసీ 2017 ప్రకారం ప్రతిపాదన సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా వారి నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదని పేర్కొన్నారు.

- Advertisement -

కానీ ఏపీ ప్రభుత్వం 2018వ సంవత్సరంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద లైట్ రైల్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కోసం కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్‌కు పంపగా వారు ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చడంలో విఫలమైనట్టు తెలిపారు. ఈ విషయం తెలిసినా విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఏ ఏజెన్సీ నుంచీ ఆర్థిక సహాయం కోరుతూ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని చెప్పారు. కేంద్రమంత్రి జవాబుపై ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఇప్పటికైనా వైసీపీ సర్కార్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు రూపొందించి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement