Wednesday, April 24, 2024

చట్టాలను మొత్తంగా తొలగించాల్సిన అవసరం లేదు, మార్పులు చేస్తే చాలు : కారుమూరు నాగేశ్వర రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పాత చట్టాల్లో అన్నింటినీ పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదని, కొన్నింటిలో అవసరమైన సవరణలు చేసుకుని కొనసాగించడమే మేలని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన “నేషనల్ వర్క్‌షాప్ ఆన్ లీగల్ మెట్రాలజీ యాక్ట్, 2009” పాల్గొన్న ఆయన మాట్లాడారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇదే శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి, అశ్విని కుమార్ చౌబేతో పాటు అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత మెరుగుపర్చడం కోసం లీగల్ మెట్రాలజీ చట్టంలో సవరణలు తీసుకొచ్చి, క్రిమినల్ కేసులు లేకుండా సులభతరం చేసే విషయంలో రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తూనే పరిశ్రమలు, పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే క్రమంలో పాత చట్టాలకు సవరణలు చేయడమో లేక, పూర్తిగా తొలగించి కొత్త చట్టాలను తీసుకురావడమో చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ అవసరమైన సవరణలు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

వర్క్‌షాప్ అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి, కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులతో పాటు కేంద్రం రాష్ట్రానికి చేయవలసిన పనుల గురించి కేంద్ర పెద్దలతో చర్చిస్తానని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితుల గురించి వివరిస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రం పేదల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ. 1,35,000 కోట్లు వెచ్చించిందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement