Thursday, April 18, 2024

ధాన్యం సేకరణకు దేశమంతటా ఒకే విధానం.. ఏ రాష్ట్రంపై వివక్ష లేదు : సుధాంశు పాండే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశమంతటా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు. ఇందులో రాష్ట్రాల మధ్య తేడా ఏమీ లేదన్నారు. సోమవారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే పాలసీ అమల్లో ఉందన్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరా నుంచి నీటిపారుదల రంగం సహా అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికే ప్రమేయం ఉంటుందని, డీసీపీ ఒప్పందాలున్న రాష్ట్రాలన్నీ రైతుల వద్ద సేకరించి, మిల్లింగ్ చేసి తమ వాటా బియ్యాన్ని మిగిల్చి మిగతాది ఎఫ్‌సీఐకి అందజేస్తాయని సుధాంశు వివరించారు. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు రాష్ట్రాలకు ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన వివరించారు. కేంద్రం నేరుగా వడ్లను సేకరించడం జరగదన్న సుధాంశు, ఎంత అవసరం ఉందో, అంతే తీసుకుంటామని చెప్పారు. ఎవరూ వినియోగించని బాయిల్డ్ రైస్ మేం కొని ఏం చేసుకోవాలి? అలా కొంటే వృథా అయ్యేది ప్రజాధనమేనని స్పష్టం చేశారు.

ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తరహా వాతావరణ పరిస్థితులు కలిగిన తెలంగాణాలో ఈ సమస్య ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. రబీలో కూడా ఏపీ ముడి బియ్యాన్నే సరఫరా చేస్తోందని ఆయన చెప్పారు. తాము ఎవరి మీదా వివక్ష చూపించట్లేదని, తెలంగాణలో గత ఐదేళ్ళ లో ఏడు రెట్లు ధాన్యం సేకరించామని ఆయన తెలిపారు. ఖరీఫ్‌లో 68.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని, ఎఫ్‌సీఐ వద్ద వద్ద ఇప్పటికే 88.37 ఎల్‌ఎం‌టీ పారా బాయిల్డ్ రైస్ ఉందని ఆయన వెల్లడించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచే 40కి పైగా ఎల్‌ఎం‌టీ ధాన్యం సేకరణ చేశామని చేశామని వివరించారు. ఈ సీజన్‌లో పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ రాతపూర్వకంగా ఇచ్చిందని సుధాంశు గుర్తు చేశారు. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై ఇప్పటివరకు తెలంగాణా నుంచి ఎలాంటి ప్రణాళిక అందలేదని ఆయన వివరించారు. పంజాబ్ నుంచి తాము పారా బాయిల్డ్ రైస్ తీసుకోలేదని, తీసుకునే ప్రసక్తే లేదని అన్ని రాష్ట్రాలకూ చెప్పామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్రం ఎప్పుడూ పారాబాయిల్డ్ రైస్‌ను ప్రోత్సహించలేదని సుధాంశు చెప్పుకొచ్చారు. తెలంగాణ ముడి బియ్యం ఇస్తే తీసుకోడానికి తాము సిద్ధమని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement