Friday, April 19, 2024

Big Story: మద్యం మత్తులో యువత చిత్తు.. గంజాయి, సిగ‌రెట్ల‌కు బానిస‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒక దేశ భవిష్యత్‌ బాగుండాలంటే ఆ దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉండడంతోపాటు వారు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యువత మద్యం మత్తులో చిత్తు అవుతోంది. మద్యంతోపాటు ధూమపానం, గంజాయి సేవించడం వంటి ఇతర వ్యసనాల ఊబిలో కూరుకుపోయింది. తాజాగా 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతపై చెడు మద్యం, డ్రగ్స్‌, దూమపానం తదితర వ్యసనాల ప్రభావం ఏమేరకు ఉందో వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం… 15-19 మధ్య వయస్కు ఉన్న యువత ప్రతి నలుగురిలో ఒకరు మద్యం/ అల్కాహాల్‌ సేవిస్తున్నారు.

ఇదే ఏజ్‌ ఏజ్‌ గ్రూప్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు అధికంగా మద్యం తాగుతున్నారు. 15-19 ఏళ్ల మధ్య వయస్కుల్లో డ్రగ్స్‌ తీసుకునేవారిలో ఎక్కువగా గంజాయిని సేవిస్తున్నారు. ఇక 15-16 వయస్కులో ప్రతి 20మందిలో ఒకరు అంటే 5శాతం మేర గంజాయి సేవిస్తున్నారు. 13-15ఏళ్ల వయసు వారిలో 10మందిలో ఒకరు దూమపానం చేస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యల బారిన పడి… 14-19 మధ్య అమ్మాయిల్లో ప్రతి వెయ్యిందిలో 41మంది గర్భం దాలుస్తున్నారు. ఆ వయసులో గర్భం దాల్చడంతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులో పిల్లలకు జన్మనివ్వడంతో పుట్టిన పిల్లల పెంపకం సరిగా ఉండడం లేదు.

ఇక యువతలో ఎక్కువ మంది ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఈత రాక నీటిలో పడి చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అదేవిధంగా.. 10-19 ఏళ్ల వయసు వారిలో ప్రతి ఆరుగురిలో ఒకరు అధిక బరువుతో ఉన్నారు. ప్రతి ఐదుగురు యువతలో ఒకరే శారీరక శ్రమ (వ్యాయామం) చేస్తున్నారు. 80శాతం యువత వ్యాయామానికి దూరంగా ఉంటోంది. 10-19 ఏళ్ల వయస్సులో ఏడుగిరిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయి. ప్రసతుతం భారతదేశ జనాభాలో యువత శాతం 66 శాతంగా ఉంది.

తలిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : డాక్ట‌ర్ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి, నిజామాబాద్‌ వైద్య కళాశాల

24 ఏళ్ల లోపు యువత అధికంగా మద్యం, ఇతర వ్యసనాల బారిన పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లల నడవడిక, వారి వ్యవహారతీరును గమనిస్తూ ఉండాలి. అయితే స్నేహితుడిలా మొదులుతూ పిల్లలు చెడు దారిలో పోకుండా చూసుకోవడం ఎంతో అవసరచం. 24ఏళ్ల లోపు యువతతోనే దేశ ఉత్పాదకత పెరుగుతుంది. మెరుగైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన యువత అవసరం ఎంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement