Saturday, April 20, 2024

2023లోనే ప్రపంచ ఆర్ధిక మాంద్యం, వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అంచనా

ప్రపంచ ఆర్ధిక మాంద్యం 2023లోనే వచ్చే అవకాశం ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) అంచనా వేసింది. ఫోరంకు చెందిన ముఖ్య ఆర్ధికవేత్తలు, నిపుణులతో కూడిన కమిటీ అవుట్‌లుక్‌ సర్వేను విడుదల చేసింది. చైనా నుంచి తయారీ రంగం , సప్లయ్‌ చైన్‌ వంటివి తరలిపోతే, ఇండియా, బంగ్లాదేశ్‌తో పాటు, మరికొన్ని ఆసియా దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఆర్ధికంగా సం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నందున ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు, సంస్థలు, వ్యాపారం రంగంలో భారీగా ఖర్చు తగ్గించుకునే చర్యలకు దిగే అవకాశం ఉందని తెలిపింది. ద్రవ్యోల్బణం భయాల నేపధ్యంలో బలమైన ఆర్ధిక స్థితిలో ఉండాలని కంపెనీలు, వ్యాపార సంస్థలు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కమ్యూనిటీ చీఫ్‌ ఎకనామిస్ట్‌లో ఎక్కువ మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని, దీని ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపై గణనీయంగా ఉంటుందని వీరు అంచనా వేశారు.

- Advertisement -

అమెరికా, యూరప్‌ దేశాలు మరింతగా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫోరంలోని ప్రధాన ఆర్ధికవేత్తల్లో మూడింట రెండు వంతుల మంది 2023లోనే ప్రపంచ ఆర్ధిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని నమ్ముతున్నారు. వీరిలో 18 శాతం మంది ఇది చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 2022, సెప్టెంబర్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన సర్వే కంటే ఈ అభిప్రాయం తాజా సర్వేలో ఎక్కవగా వెల్లడైంది. ఆర్ధికవేత్తల్లో మూడోవంతు మంది మాత్రం ఆర్ధిక మాంద్యం రాదని గట్టిగా వాదిస్తున్నారు. 2023లో వృద్ధికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా యూరోప్‌, అమెరికాలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఫోరం సర్వేలో పాల్గొన్న ముఖ్య ఆర్ధికవేత్తలు చాలా మంది 2023లో ఐరోపాలో బలహీనమైన వృద్ధిరేటు ఉంటుందని భావిస్తున్నారు. 91శాతం మంది ఆర్ధికవేత్తలు అమెరికా వృద్ధిరేటు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. చైనాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. చైనా విషయంలో మాత్రం ఆర్ధికవేత్తల్లో సగం మంది వృద్ధి బలంగా ఉంటుందని, సగం మంది బలహీనంగా ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం అంచనాల్లో ప్రాంతాల మధ్య ఆర్ధికవేత్తలు గణనీయమైన వైవిధ్యాన్ని చూపించారు. చైనాలో ఇది 5 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తే, అదే యూరప్‌లో 57 శాతం వరకు ఉంటుందని వీరు అంచనా వేవారు.

2023లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటుందని మాంద్యాన్ని అంచనా వేస్తున్న ప్రధాన ఆర్ధికవేత్తల్లో మూడింట రెండు వంతుల మంది అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధిరేటు, అధిక రుణాలు, తిరిగి మెరుగైన స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆహారం, ఇంధనం, నైపుణ్యాల అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలు పెంచేందుకు దేశ నాయకులు దృష్టి సారించాలని, అప్పుడే సంక్షోభాలను అధిగమించేందుకు వీలు కలుగుతుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాధియా జాహిది అభిప్రాయపడ్డారు. బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించే దిశగా నాయకులు ప్రయత్నాలు చేయాలని కూడా ఆయన కోరారు. సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకునేందుకు కూడా అణ్వేషణ జరగాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement