Wednesday, April 24, 2024

కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం.. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సాధ్యమైనంత త్వరగా టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం చేరువ చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర్రంలోని ప్రతీ జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా గత ఏడాది 8 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా మరో 9 కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగాం, నిర్మల్‌, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాలలో కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో కొత్త మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ ఆసుపత్రులకు రూ.34.38 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన పనులపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటికి సంబంధించి టెండర్‌ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం (ఎన్‌ఎంసి) పరిశీలనకు వచ్చే నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, అకడమిక్‌ స్టాఫ్‌, బోధనేతర సిబ్బంది వంటి అన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి అవసరమైన సదుపాయాలు కల్పించేలా చూడాలని ఇందుకు అన్ని శాఖలు అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement