Thursday, April 25, 2024

మూడు నెలల్లో బి.వెల్లంల ప్రాజెక్టు పనులు పూర్తి.. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

, (ప్రభన్యూస్‌): ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులు మూడు నెలల్లో పూర్తయి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మంగళవారం నార్కట్‌పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో ప్రగతిభవన్‌లో బ్రాహ్మణవెల్లంల, ఉదయ సముద్రం ప్రాజెక్టుపై చర్చించగా వెంటనే సీఎం సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రాజెక్టులు ప్రధాన భాగాలైన అప్రోచ్‌ కెనాల్‌, సొరంగం, సర్జిపూల్‌, పంపుహౌజ్‌, సబ్‌స్టేషన్‌, బ్రాహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయని వివరించారు.

ఉదయసముద్రం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని, భూసేకరణ, పెండింగ్‌ పనులపై ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. మూడు నెలల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లక్ష మందితో ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభిస్తామని అన్నారు. దేశ రాజకీయాల్లో అపర మేధావి కేసీఆర్‌ అని, ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, కుల, మత రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలో తావులేదని అన్నారు. బీజేపీ నాయకుల కుట్రలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించబోరని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement