Friday, April 26, 2024

Spl story | ఊరంతా డాక్టర్లే.. ప్రతీ కుటుంబంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి

ఆముదాలవలస, (ప్రభ న్యూస్‌): జిల్లాలో అదో మారు మూల గ్రామం, అందునా రైతాంగం ఎక్కువ. అయితే ఆ గ్రామంలో ప్రస్తుతం సింహభాగం వైద్యులే ఉండడం విశేషం. అదే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామం. దాదాపు 150 మంది ఎంబిబిఎస్‌ వైద్యులే ఈ గ్రామానికి చెందిన వారు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండడం విశేషం. ఇందుకు మూడు తరాలముందే పునాది పడిందంటే నమ్మక తప్పదు. ఆ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడేవారంతా వారివారి పిల్లలను గొప్ప చదువులు చదివించి ఎక్కువమంది వైద్యులు ఉండగా, మరికొందరు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. తాము చెమడోడ్చి రైతాంగం చేసుకున్నా పర్వాలేదు గాని, తమ పిల్లలు మాత్రం ఉన్నతస్థాయిలో ఉండాలన్న వారి కలలు వృధా కాలేదు. తొలితరం వ్యవసాయంలో చెమటోడ్చగా, రెండవ తరం వారు చదువుల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఆ తరువాత ఎక్కువ మంది వైద్య వృత్తిని ఎంచుకున్నారు. తల్లితండ్రుల ఆశయంతోపాటు, అక్కడ విద్యార్ధుల్లో వైద్య విద్యపై పెరిగిన ఆసక్తి ఫలితంగా ఆ గ్రామం వైద్యుల గ్రామంగా మారిపోయింది.

ఆ గ్రామంలో ఎక్కువ మంది యువత ఎంబిబిఎస్‌ చదువుకుని వైద్యలయ్యారంటే, వారికి ఇద్దరు యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ఫలితంగా 150 వైద్య చదువును అభ్యసించి వివిధ ప్రాంతాల్లో వారి సేవలందిస్తున్నారు. అలాగే వందలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉంటారంటే ఆశ్చరమేస్తోంది. మొదటి తరం వారు కేవలం రైతాంగంపై ఆధారపడి జీవించగా, ఆ తరువాత వచ్చిన మూడు తరాలవారు మంచి చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడం విశేషం. జనాభాపరంగా చిన్న గ్రామమైనా వ్యవసాయం చేసుకొనే ఆ గ్రామస్తులు క్రమేపీ విద్యకు ప్రాధాన్య ఇస్తూ వచ్చారు. తమ పిల్లలను బాగా చదివించారు. ప్రస్తుతం ఆ గ్రామ జనాభా 2800ల మంది వరకూ ఉన్నారు. వారిలో 900లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడినవారే ఉన్నారు.

- Advertisement -

క్రమశిక్షణతో గ్రామ యువకులు చదివారు : సర్పంచ్‌ నూకరాజు..

తమ గ్రామంలోని యువతీ, యువకులు ఎంతో క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడం, అందునా ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. పూర్వం తమ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారని అయితే వారి తల్లితండ్రులు పడుతున్న కష్టాలు చూసి, పిల్లలు కష్టపడి చదివి ఎక్కుమంది తొలుత ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించారని సర్పంచ్‌ నూకరాజు తెలిపారు. ఆ తరువాత వారి పిల్లలు బాగా చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, ఢిల్లీలో ఎయిమ్స్‌ మొదలుకొని, శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రి వరకూ అనేక ప్రధాన ఆసుపత్రుల్లో తమ గ్రామానికి చెందిన వారు వైద్యులుగా ఉండడం తమకు ఎంతో గర్వకారణమని సర్పంచ్‌ తెలిపారు.

ఇంజనీరింగ్‌, వైద్య వృత్తులపై యువత ఆసక్తి చూపారు : విశ్రాంత ఉద్యోగి బొడ్డేపల్లి నారాయణరావు..

తమ గ్రామంలోని పిల్లలు ఎంతో క్రమశిక్షణతో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, రైల్వే, పోలీసు, ఆర్మీతోపాటు, అనేరకంగాల్లో స్థిరపడ్డారని విశ్రాంత ఉద్యోగి బొడ్డేపల్లి నారాయణరావు తెలిపారు. ప్రస్తుతం 120 మందికి పైగా ఎంబిబిఎస్‌ చదివి వైద్యులయ్యారని ఇంకా అనేకమంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.

విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డేపల్లి జనార్ధనరావు..

తమ గ్రామంలో ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున ఇంటికి ఇద్దురు ప్రభుత్వ ఉద్యోగులు చొప్పున ఉన్నారని విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డేపల్లి జనార్ధనరావు తెలిపారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమని, ఉన్నత చదువులు చదివినవారంతా వ్యవసాయదారులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేనని తెలిపారు.

విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డేపల్లి మోహనరావు..

తమ పూర్వీకులు పిల్లలను బాగా చదివంచేందుకు ఎంతో కష్టబడ్డారని, వారి శ్రమ వృధా కాలేదని విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డేపల్లి మోహనరావుతెలిపారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఏ విభాగంలో చూసినా తమ గ్రామానికి చెందిన యువతే కనిపిస్తారని ఆయన తెలిపారు.

ఆ ఇద్దరు వైద్యులు ఆదర్శంగా నిలిచారు : వైద్యులు బొడ్డేపల్లి సురేష్‌..

కనుగులవలస గ్రామంలో తొలుత ఇద్దరు వైద్య విద్యనభ్యసించి గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలిచారని శ్రీకాకుళం సన్‌రైజ్‌ ఆసుపత్రి వైద్యులు బొడ్డేపల్లి సురేష్‌ తెలిపారు. 1970లో మొట్టమొదటిసారిగా బెండి చంద్రరావు, నూక భాస్కరరావు అనే వ్యక్తులు ఎంబిబిఎస్‌ చదివారని, అప్పటి నుండీ తమ గ్రామంలో అనేకమంది వారిని ఆదర్శంగా చేసుకొని వైద్య విద్యను అభ్యసించారని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోగల ప్రధాన అసుపత్రులన్నింటిలో తమ గ్రామానికి 25 మంది వరకూ వైద్యసేవలందిస్తున్నారని తెలిపారు. న్యూరో ఫిజీషియన్‌లు, గైనకాలజిస్టు, చెవి, గొంతు, ముక్కు నిపుణులు, డెంటిస్ట్‌లు, బోన్‌ స్పెషలిస్టులు ఇలా వైద్య విభాగంలో అనేక వ్యాధులకు సంబందించిన స్పెషలిస్టులుగా తమ గ్రామానికి చెందిన వారు ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement