Friday, March 29, 2024

పదవీకాలం ముగిసిపోతోంది, విచారణ చేపట్టి తీర్పునివ్వండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ కేసులో సుప్రీంకోర్టుకు పిటిషనర్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీకి చెందిన శాసన సభ్యులు రాజా సింగ్ ఎన్నికల అఫిడవిట్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా పడింది. ఎన్నికల అఫిడవిట్లో పూర్తి సమాచారం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ బుధవారం జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. వచ్చే నెలలో దీనిపై విచారణ చేపడతామంటూ ధర్మాసనం వెల్లడించింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యే పదవీకాలం ఇంకా ఎంతోకాలం లేదని, కొన్ని నెలల్లో పదవీకాలం ముగుస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ పరిస్థితుల్లో పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టి తీర్పునివ్వాలని కోరారు. వీలైతే వచ్చే వారమే దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అభ్యర్థించారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజా సింగ్ తన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కొన్ని కేసుల వివరాలను పొందుపర్చలేదని ప్రేమ్ సింగ్ రాథోడ్ ఆరోపిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న 28 కేసులను మాత్రమే ప్రస్తావించారని, మరో 5 కేసుల వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని అందులో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజాసింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ మళ్లీ వాయిదా పడింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement