Thursday, April 18, 2024

ఫిబ్రవరిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అసాధరణంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఫిబ్రవరిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. వారం, పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో గతేడాది మార్చి నెల ఆరంభంలో ఎండలు మండిపోతేనే అబ్బో అన్న ప్రజలకు… ఈసారి ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని రూచిచూపిస్తున్నాడు. రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఎండ తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

- Advertisement -

గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఎండలు తీవ్రంగా ఉన్నాయన్నారు. మార్చి 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏప్రిల్‌ దాటాక వడగాల్పులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో వారం క్రితం వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 34.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా శుక్రవారం అవి 38 డిగ్రీలకు చేరుకున్నాయి. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం.

రానున్న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల దాకా అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర వాయివ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరంత పెరగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే వారంపాటు రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పేర్కొంది. ఎండలు మండిపోతుండడంతో కూలర్లు, ఏసీల మెకానిక్‌లకు చేతినిండా పనిదొరుకుతోంది. కూలర్లు, ఏసీల విక్రయాలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement