Tuesday, April 23, 2024

Spl Story | డాగ్ వాకర్‌గా ఏడాదికి కోటి ఆదాయం.. స్కూల్ జాబ్ మానేసిన ఓ టీచర్ సక్సెస్ స్టోరీ!

సాధారణంగా ఎవరైనా డబ్బు సంపాదించడానికి ఐటీ రంగంలోనో లేదా బ్యాంకింగ్‌ రంగంలోనో జాబ్ కావాల‌ని ఆశిస్తారు. కానీ, న్యూయార్క్ సిటీలోని బ్రూక్లిన్ నివాసి మైఖేల్ జోసెఫ్ మాత్రం కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించాడు. అందుకే ఇప్పుడ‌త‌ను వార్తల్లోని వ్యక్తిగా మారాడు. అప్పటిదాకా చేస్తున్న త‌న టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి ఓ డాగ్ ట్రైనర్ అవతారం ఎత్తి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. అతని కథేంటో చదివి తెలుసుకుందాం..

– ఇంట‌ర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ‌

న్యూయార్క్ సిటీకి చెందిన మైఖేల్ జోసఫ్ ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చులు, ఎదుగున్న కొడుకు చదువుల కోసం తాను సంపాదిస్తున్న ఆదాయం ఏమాత్రం చాలడం లేదు. పైగా రెంట్ ఇల్లు.. ఇవన్నీ ఆలోచించిన జోసెఫ్ ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు.

అయితే.. తన దగ్గరున్న బ్లాక్ లాబ్రడార్ పెట్ డాగ్ని ట్రెయిన్ చేయడం ప్రారంభిస్తూనే టీచర్గా జాబ్ కొనసాగించాడు. ఇక.. ఈ డాగ్ ట్రెయినింగ్ వ్యవహారం తన చుట్టు ముట్టు వాళ్లను బాగా ఇంప్రెస్ చేసింది. వారి పెట్స్ కి కూడా ట్రైనింగ్ ఇస్తే కొంత మొత్తం ఇస్తామని చెప్పడంతో దీన్ని సైడ్ బిజినెస్గా ప్రారంభించాడు.

ఇట్లా మొదలైన సైడ్ బిజినెస్ కాస్తా.. పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చడంతో మైఖేల్ జోసెఫ్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇక మీదట డాగ్ వాకర్ (ట్రైనర్) గా ఫుల్ టైమ్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అప్పటిదాకా తను చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని మానేశాడు. ఇట్లా టీచర్ జాబ్ చేసిన‌ప్పటికంటే అత‌నికి అధిక సంపాద‌న రావ‌డం మొద‌లైంది.

- Advertisement -

టీచ‌ర్‌గా ఉన్నప్పుడు ఏడాదికి సుమారు రూ.30 లక్షల వ‌ర‌కే సంపాదించేవాడినని జోసెఫ్ చెబుతున్నాడు. కానీ, డాగ్ ట్రైన‌ర్‌గా మారిన త‌ర్వాత ఏడాదికి దాదాపు 1 కోటి రూపాయ‌ల దాకా సంపాదిస్తున్నట్టు వెల్లడించాడు. ఈ విష‌యాన్ని అత‌నే సంతోషంగా చెబుతున్నాడు. అందుకే స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్‌గా ఆలోచించాల‌ని, అట్లా ముందుకెళ్తేనే ఆదాయ ప‌రంగా కూడా బాగుంటుంద‌ని సూచిస్తున్నాడు.

డాగ్ వాకర్ ఉద్యోగం చేస్తూ.. ప్రస్తుతం అతను న్యూజెర్సీలోని మిడిల్‌టౌన్‌లో ఒక ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేశాడు. అంతేకాకుంగా తన 18 నెలల పసిబిడ్డ కోసం కాలేజీ ఫండ్‌లో 8.16 లక్షల రూపాయలను పక్కన పెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న తాను.. త‌న‌ వార్షిక ఆదాయంపై కొంచెం అదనంగా సంపాదించడానికి ముందు సైడ్ బిజినెస్ 2019 ప్రారంభంలో డాగ్ వాకర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించానని చెప్పాడు.

తన సొంత బ్లాక్ లాబ్రడార్‌కు ఇచ్చిన ట్రైనింగ్ కు చాలా మంది ఇంప్రెస్ అయ్యారని, దీంతో చాలామంది వారి పెట్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చేందకు తనని హైర్ చేసుకున్నట్టు తెలిపాడు. ఇక ఆ ఫీల్డ్ లో పెరుగుతున్న‌ ఆదాయాన్ని గ్రహించిన మైఖేల్.. ఫుల్ టైం డాగ్ వాకర్‌గా మారాలని నిర్ణయించుకున్నట్టు వివ‌రించాడు.

2019లో ‘పార్క్ సైడ్ పప్స్’ అనే పేరుతో సొంత బిజినెస్ కూడా ప్రారంభించాడు. ఏడాది తిర‌గ‌కముందే రూ.28.56 లక్షలు సంపాదించాడు. 30 నిమిషాల పాటు డాగ్ వాకింగ్ కి 20 అమెరికన్ డాల‌ర్ల దాకా ఫీజు నిర్ణయించాడు. అట్లాంటి వారు చాలామందే త‌న క్లయింట్లుగా ఉన్నారు. దీంతో గత ఏడాది (2022)లో జోసెఫ్ పార్క్ సైడ్ పప్స్ బిజినెస్ దాదాపు 1 కోటి రూపాయలు టర్నోవర్ కు చేరుకుంది. ఇక‌.. ఈ స‌రికొత్త వ్యాపారంతో త‌న జీవనశైలి మారిందని, ఇది తననే ఆశ్చర్యపరిచిందని అంటున్నాడు జోసెఫ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement