Monday, March 18, 2024

Delhi | కొవిడ్ కథ ఇంకా ముగియలేదు.. ఫ్లూ, కొవిడ్-19పై సమీక్షలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో పెరుగుతున్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా సహా కోవిడ్-19 కేసుల నేపథ్యంలో దేశంలోని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్న ఈ రెండు అంశాలపై అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి, వైద్యారోగ్య వ్యవస్థ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యులు డా. వీకే పాల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శులు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్, సహాదారులు, ఇతర ప్రధాని కార్యాలయ అధికారులు హాజరయ్యారు.

కోవిడ్-19 వైరస్ జన్యుపరివర్తనాలు, కొత్త వేరియంట్లను గుర్తించడంతో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లోనూ వస్తున్న మార్పులు, ప్రజా సమాజంపై వాటి ప్రభావాలపై మోడీ తన సమీక్షలో ప్రధానంగా చర్చించారు. గత 2 వారాలుగా ఈ రెండు రకాల కేసులు పెరగడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు చెప్పారు.

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి దేశంలోని కోవిడ్-19 తాజా స్థితిగతులపై పూర్తి వివరాలతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. కోవిడ్-19 కేసులు వారం వ్యవధిలో 888 నమోదయ్యాయని, పాజిటివిటీ రేటు 0.98% గా ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సగటున 1.08 లక్షల కేసులు నమోదవుతున్నాయని గణాంకాలను పోల్చి చూపించారు. 2022 డిసెంబర్ 22న ప్రధాన మంత్రి నిర్వహించిన సమీక్ష అనంతరం తీసుకున్న చర్యల వివరాలను కూడా ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రధానికి వివరించారు.

- Advertisement -

కోవిడ్ వైద్య చికిత్సలో ఉపయోగిస్తున్న 20 రకాల కీలక మందులు, మరో 12 రకాల ఇతర మందులు, 8 రకాల బఫర్ డ్రగ్స్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైద్య చికిత్సలో ఉపయోగిస్తున్న మందుల లభ్యత గురించి కూడా ప్రధానికి వివరించారు. డిసెంబర్ 27న నిర్వహించిన దేశవ్యాప్తంగా 22,000 ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించి లోటుపాట్లను సమీక్షించినట్టు వెల్లడించారు. వాటన్నింటినీ సరిదిద్దినట్టు తెలిపారు. అలాగే దేశంలో H1N1 ఇన్‌ఫ్లూయెంజాతో పాటు H3N2 రకం జన్యుపరివర్తన చెందిన వైరస్ కారణంగా ఏర్పడుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసుల గురించి కూడా ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచి వైరస్ కొత్త వేరియంట్లను గుర్తిస్తూ ఉండాలని, తద్వారా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి వీలవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులకు చెప్పారు. అదే సమయంలో మాస్కులు ధరించడం వంటి కోవిడ్-19 జాగ్రత్తలను ఆస్పత్రుల్లో అటు వైద్యులు, ఇటు రోగులు తప్పనిసరిగా పాటించాలని కూడా ఆయన సూచించారు. అలాగే రద్దీ ప్రాంతాలను సందర్శించే వయోధికులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు సైతం మాస్కులు ధరించాలని అన్నారు. దేశంలో స్వల్పంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, ఇన్‌ఫ్లూయెంజా కేసులపై ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలతో చర్చించాలని, తగిన సూచనలు చేస్తుండాలని ప్రధాని సూచించారు. వైద్య చికిత్సలో ఉపయోగించే ఔషధాల లభ్యత, పెరగనున్న డిమాండ్, తయారీ సామర్థ్యం, ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య, వైద్య సిబ్బంది సంఖ్య వంటి అంశాలపై కూడా ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్-19 కథ ముగిసిందని ఇంకా అనుకోడానికి వీల్లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులతో అన్నారు. పూర్తిగా అంతమయ్యే వరకు దేశం నలుమూలలా కోవిడ్-19పై ఓ కన్నేసి ఉంచాల్సిందేనని వ్యాఖ్యానించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్-19 జాగ్రత్తలు, ల్యాబ్ పరీక్షలు, శ్వాసకోస వ్యాధుల కేసులతో కూడిన 5టీ ఫార్ములాను అమలు చేయాలని సూచించారు. ఆస్పత్రులు, వైద్య వ్యవస్థలో మాక్ డ్రిల్స్ తరచుగా నిర్వహిస్తూ లోటుపాట్లను గుర్తిస్తూ ఉండాలని, వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఆయన కీలక సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో కోవిడ్-19 జాగ్రత్తలను ప్రజలు పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement