Friday, May 20, 2022

కరోనా టైంలో స్టాఫ్‌నర్సుల సేవలు గొప్పవి.. త్వరలో 4722 నర్సుల నియామకానికి నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సమాజంలో డాక్టర్లకు ,స్టాఫ్‌ నర్స్‌లకు చాలా గౌరవం ఉందని, కరోనా సమయంలో ఇదే నిరూపితమైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి హాజరై అత్యుత్తమ సేవలందించిన పలువురు నర్సులకు హరీశ్‌రావు అవార్డులందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కన్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కరోనా సమయంలో కొంత మంది నర్సులు సేవలు చేశారన్నారు. కరోనా ధాటికి కొందరు నర్సులు మరణించినా.. మిగతావారు అధైర్య పడకుండా సేవలు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. త్వరలో 4722 స్టాఫ్‌ నర్సుల నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామన్నారు. కరోనా సమయంలో పని చేసిన వారికి ఈ నోటిఫికేషన్‌ లో వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘స్టాఫ్‌నర్స్‌ల ప్రేమ తల్లి లాంటిది. స్టాఫ్‌ నర్స్‌ల స్పర్శ తల్లి లాంటిది. పుట్టిన పిల్లలకు తొలి స్పర్శ తల్లి కన్నా ముందు నర్సులే అందిస్తారు. గతంలో నర్సింగ్‌ విద్యార్థులకు స్టై ఫండ్‌ ఎప్పుడో 6 నెలలకు వచ్చేది, అది కూడా చాలా తక్కువ. స్టై ఫండ్‌ను 1500 నుంచి తమ ప్రభుత్వంరూ. 7వేలకు పెంచింది. నర్సింగ్‌ విద్య ప్రాధాన్యం, మహిళలకు ఉన్న అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు, నర్సింగ్‌ విద్యను పటిష్టం చేయాలని నిర్ణయించారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో పాటు నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు ముందు నర్సింగ్‌ కాలేజీలు 6 ఉండేవి. ఇప్పడు 33 కాలేజీలను ఏర్పాటు చేశాం. నర్సింగ్‌ స్కూళ్లను రానున్న రోజుల్లో అప్‌గ్రేడ్‌ చేస్తాం. ఎన్‌హెచ్‌ఎమ్‌ నుంచి కొంతమంది నర్సులకు ఎస్‌ఎన్‌సియూలో శిక్షణ ఇస్తున్నాం. మెంటల్ హెల్త్‌కి సంబంధించి స్టాఫ్‌ నర్సులకు శిక్షణనిస్తున్నాం. ఇంతకు ముందు ప్రమోషన్‌లలో ఆలస్యమయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నర్సింగ్‌ కౌన్సిల్‌ని బలోపేతం చేస్తాం. నర్సింగ్‌ డైరెక్టరేట్‌ గురించి సీఎం కేసీఆర్‌ పాజిటివ్‌ గా ఉన్నార’ని హరీశ్‌రావు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement