Saturday, October 12, 2024

బెంబేళెత్తిస్తున్న విష జ్వరాలు.. పల్లె, పట్టణం తేడా లేకుండా వ్యాప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఇంటికి వెళ్లిన జ్వరపీడితులు ఉంటున్నారు. చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా దగ్గు, జలుబు, జ్వరంతో పెద్ద సంఖ్యలో జనం బాధపడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతీ వర్షాకాలంలో వైరల్‌ వ్యాధుల వ్యాప్తిఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పుల వంటి సమస్యలు రోజుల తరబడి ఉండడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు.

రాష్ట్రంలో రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్ర యివేటు ఆసుపత్రులు జ్వర బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. జలుబు, దగ్గు, విరేచనాలు, జ్వరంతో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమలు బాగా వృద్ధిచెందుతున్నాయని, దీంతో దోమకాటు పెరిగిపోవడం కారణంగానే సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

దోమ కాటుతో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్‌ జ్వరాలు అంటుకుంటున్నాయి. ప్రస్తు తం రాష్ట్రంలో ప్రతీ 10 మందిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వైరల్‌ ఫీవర్స్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల రోజువారీ ఓపీల్లో ముప్పాతికవంతు జ్వర పీడితులే ఉంటున్నారంటే విష జ్వరాల వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థమవుతోంది.

దోమకాటు పెరిగిపోతుండడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలతోనూ పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రమాదకరస్థాయిలో డెంగీ, మలేరియా కేసులు నమోదు కాలేదని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ చెబుతోంది. టైఫాయిడ్‌, మలేరియా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారికి మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులను ఆదేశించినట్లు వివరించారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏఎన్‌ఎంలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించి వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించింది. తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజులుగా నగరంలో వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రతీ నాలుగో వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతోపాటు శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో దోమకాటు పెరిగిపోవడం, మాస్కులు ధరించకుండా, సామాజికదూరం పాటించకపోవడంతోనే విషజ్వరాలతోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా, కోరంటి ఫీవర్‌ ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రులో రోజూ 500దాకా విషజ్వరాల బాధితులు చేరుతున్నారు. రానున్న ఒకటి, రెండు వారాల్లో విషజ్వరాలు మరింత వేగంగా విజృంభిస్తాయని వైద్యులు హెెచ్చరిస్తున్నారు.

విష జ్వరాల విషయంలో ప్రజలు భయాందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో వైద్యం తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో వైద సిబ్బంది, ఆశా వర్కర్లను అప్రమత్తం చేశామని చెప్పారు. పీహెచ్‌సీల్లో, ఆసుపత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. దోమల నివారణకు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ది శాఖల సమన్వయంతో శానిటేషన్‌ పనులు నిర్వహిస్తున్నామన్నారు.

చిన్నారులకు తీవ్రమైన జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు సామాజికదూరాన్ని పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వృద్ధి తగ్గుతుందని, దాంతో దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగీ జ్వరాలు దరీ చేరవని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement