Thursday, April 25, 2024

ఒకే వరుసలో ఐదు గ్రహాలు.. తెల్లవారుజామున ఆకాశంలో వెలుగులు!

ఆకాశంలో అరుదైన దృశ్యం కనువిందు చేయబోతోంది. సుదూరంగా వందల కోట్ల కి.మి. దూరంలో వేరువేరు కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న ఐదు ప్రధాన గ్రహాలు వాటి కక్ష్యల్లోనే ఉన్నప్పటికీ ఒకే వరుసలోకి రానున్నాయి. ఆ దృశ్యాన్ని మనం నేరుగా ఆకాశంలో తిలకించొచ్చు. అయితే ఆ ఖగోళ సంయోగాన్ని చూడాలంటే తెల్లవారుజామునే లేవాల్సిందే మరి. సూర్యోదయం కాకముందు ఆకాశంలో వరుసగా అవి మిలమిల మెరుస్తూ కన్పించనున్నాయి. ఆలస్యం చేస్తే సూర్యకాంతి ధాటికి అవి మరుగునపడిపోతాయి. బుధ, శుక్ర, అంగారక, గురు, శని గ్రహాలు ఒకే వరుసలోకి రావడం.. గ్రహ సంయోగంగా చెబుతారు. మూడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం తరచూ జరిగేదే. కానీ ఇలా ప్రధాన గ్రహాలు ఐదు ఒకే వరుసలోకి రావడం కాస్త అరుదు. జూన్‌ 10వ తేదీనుంచే ఈ గ్రహసంయోగం మొదలైనప్పటికీ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. స్పష్టంగా చూసేందుకు ఇప్పుడు చాలా వీలుగా ఉంటుంది. శనివారం తెల్లవారు జామునుంచి సోమవారం తెల్లవారు జాము వరకు ఆకాశంలో తూర్పున మిలమిల మెరుస్తూ కన్పించే ఐదు గ్రహాలను ఒకే వరుసలో చూడొచ్చు. ఇలాంటి ఐదుగ్రహాల సంయోగం గతంలో 2004లో సంభవించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లి ఇప్పుడు కన్పిస్తున్న గ్రహసంయోగ దృశ్యాన్ని చూడలేకపోతే 2040 వరకు ఆగాల్సిందే.

ఉత్తరార్థ గోళంలో ఉండేవారు తెల్లవారు ఝామున ఎత్తయిన ప్రదేశాల్లోంచి తూర్పు దిశగా నేరుగా చూడొచ్చు. దాదాపు 45 నిమిషాల నుంచి గంటన్నరపాటు ఆ మనహోర దృశ్యం కన్పిస్తుంది. దక్షిణార్ధ గోళంలో ఉండేవారు ఉత్తర దిశగా ఈ దృశ్యాన్ని తిలకించొచ్చు. ఉత్తరార్థ గోళంలో కన్నా దక్షిణార్ధ గోళంలో ఉండేవారికి ఈ గ్రహ సంయోగం కాంతివంతంగా, ఎక్కువ సేపు కన్పిస్తుంది. గ్రహసంయోగ సమయంలో సూర్యునికి చేరువగా బుధ గ్రహం కన్పిస్తుంది, శుక్ర, గురు గ్రహాలు మిగతావాటికన్నా ధగధగ మెరుస్తూ కాస్త పెద్దవిగా గోచరిస్తాయి. అంగారక గ్రహం కాస్త ఎరుపువర్ణంలో మెరుస్తూ కన్పిస్తుంది. సూర్యోదయానికి ముందు ఉదయభానుడికి ఎగువన బుధ గ్రహం తచ్చాడుతున్నట్టుంటుంది. ఇక్కడ ఓ విశేషం చెప్పుకోవాలి. ఈ ఐదు గ్రహాల సంయోగ సమయంలో నేనున్నానంటూ చంద్రుడు వాటి మధ్యలోకి చేరినట్లు కన్పిస్తాడు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 26న శుక్రగ్రహం, 27న బుధగ్రహం చెంత చంద్రుడు కన్పిస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే మిగతా గ్రహాలకన్నా భిన్నంగా ఉండే శనిగ్రహం చుట్టూ ఉండే వివిధ వర్ణాల వలయాలను కూడా టెలిస్కోప్స్‌ ద్వారా చూడొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement