Friday, April 26, 2024

ఓబీసీ కులగణనను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. జాతీయ బీసీ సంఘానికి కేంద్రమంత్రి హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల ఆకాంక్ష అయిన ఓబీసీ కుల జనగణన డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే హామీ ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల ఓబీసీ వర్గాల న్యాయపరమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారని కర్రి వేణుమాధవ్ తెలిపారు.  సమావేశంలో రాందాస్ అథవాలే మాట్లాడుతూ… జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీసీలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు.

చట్టసభల్లో  ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తాను కృషి చేస్తానని అథవాలే పేర్కొన్నారు. ఎస్,సీ ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించిందని, దాన్ని సద్వినియోగం చేసుకునేలా బీసీ సంఘాలు కృషి చేయాలని ఆయన సూచించారు. చేతివృత్తులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు సహకరించాలని వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement