Saturday, April 20, 2024

జనసేన వైపు ఆ నేతల చూపు? ఇతర పార్టీల అసంతృప్తుల్లో పెరుగుతున్న ఆశలు

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖ ఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ క్రేజ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అమాంతంగా పెరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ సర్కార్‌ ప్రయోగించిన నిర్భంధాన్ని నిరసిస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ పార్టీకి మద్దతుగా నిలిచాయి. ఇక నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రకటించాడు. ఆ వెంటనే ప్రతిపక్ష నేత. చంద్రబాబు నాయుడు వచ్చి పవన్‌ కల్యాణ్‌కు సంఘీభావం ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలని పవన్‌,చంద్రబాబు కలిసి ప్రకటన చేశారు. ముందుగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక కూటమిగా మారి పోరాటాం చేద్దామని ప్రకటించారు. వీరికి తోడుగా సిీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ కూడా ముందుకు వచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో కలిసివచ్చే అన్ని పార్టీలతో కలిపి మీటింగ్‌ జరపబోతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో 2014 మాదిరి ఓ మహా కూటమి ఏర్పడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కూటమిలో ఈసారి జనసేన్‌కు తగినన్ని సీట్లు లభించవచ్చుననే చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలు, సీట్లు దక్కవు అనకున్న నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. ప్రజా పోరాటాల ద్వారా జనసేన ఇటీవల కాలంలో తన పరపతిని బాగా పెంచుకుంది. కౌలు రైతు భరోసా యాత్ర పార్టీకి మంచి ప్రతిష్టను తెచ్చింది. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ పార్టీని సంస్థాగతంగా కూడా పటిష్ఠం చేస్తున్నారు. దీంతో గత ఎన్నికలతో పోల్చితే ఈసారి జనసేన ఓటు బ్యాంక్‌ బాగా పెరిగింది. కానీ పవన్‌ కల్యాణ్‌ మాటల్లోనే తమకు పోరాట బలం ఉంది, వాదనా పటిమ ఉన్నప్పటికీ ఎన్నికల టైమ్‌లో బూత్‌ల వద్ద నిలబడి ఓట్లు వేయించే శక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా లేదన్నారు. ఈ మాట ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ఇతర పార్టీలతో పోత్తులు ఉంటాయని చెబుతూనే…ఇతర పార్టీల నుంచి సమర్ధులైన నేతలకు కూడా ఆహ్వానం పలుకుతున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చారు.

జనసేన వైపు టీడీపీ నేతల చూపు

మహాకూటమి ఏర్పడితే అందులోని అన్ని పార్టీలకీ విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న నేతలు, తమకు తమ పార్టీలో టిక్కెట్‌ దొరకకుంటే జనసేన వైపు వెళ్లిపోదామని చూస్తున్నారు. టీడీపీలో ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ఆ ఇన్‌ఛార్జ్‌తో మిగిలిన నేతలంతా సమన్వయం చేసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్షలు సందర్భంగా ఆదేశిస్తున్నారు. ఆ ఆదేశాలు పాటించని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తమకంటూ ఆ నియోజకవర్గంలో కేడర్‌ను తయారు చేసుకొని కొంత బలాన్ని ఏర్పాటు చేసుకొన్న నేతలకు ఈ పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. దీంతో వారు మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి జనసేన మంచి అవకాశంలా కనిపిస్తోంది. కుదిరితే వచ్చే ఎన్నికల్లోనే సీటు తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో హామీ తీసుకొని ఎమ్మెల్సీ అయిపోవచ్చు. అదీ కాకుంటే నామినేటేడ్‌ పదవి తీసుకోవచ్చనే అంచనాలతో వీరంతా జనసేన వైపు చూస్తున్నారు.

ఆశలు పెంచుకుంటున్న అసంతృప్త నేతలు

- Advertisement -

ఒక్క టిడిపిలోనే కాక వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. వైసీపీలో ఈసారి చాలామంది సీనియర్లను టిక్కెట్లు ఇవ్వకుండా పక్కనపెడతారనే ప్రచారం జరుగుతోంది. వీరందరికీ తమ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా మంచి పట్టునే ఉంది. దీనికితోడు జనసేన బలం, మహాకూటమి బలం చేకూరితే సునాయాసంగా గెలిచిపోతామనే ధీమాలో వీరు ఉన్నారు. వీరంతా టీడీపీ కన్నా జనసేన అయితనే బెటరనే భావనలో ఉన్నారు. ఇప్పటికే ఒంగోలు నుండి బాలినేని వాసు, నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణరెడ్డితోపాటు మరికొంతమంది వైసీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా జనసేనపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.

మంత్రి పదవులే లక్ష్యంగా చేరికలు

అటు టీడీపీలోనూ, ఇటు వైసీపీలోనూ ఉన్న పలుకుబడి కల్గిన నేతలు, మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు వారికి ఆయా పార్టీల్లో టిక్కెట్‌కు వచ్చిన సమస్య ఏమీ లేకున్నా మంత్రి పదవిపై ఆశతో జనసేనలో చేరాలని భావిస్తున్నారు. వీరంతా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అసలు మహా కూటమి ఎన్నికల్లో గెలుస్తుందా లేదా, గెలిస్తే జనసేనకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, అందులో తమకు అవకాశం ఉంటుందా లేదా అనే బేరీజు వేసుకుంటున్నారు. టీడీపీలోనో, వైసీపీలోనో ఎమ్మెల్యేగా గెలిచినా తమకు మంత్రి పదవి రాదని తెలిసినవారు జనసేనవైపు చూస్తున్నారు. మంత్రి పదవికి హామీ ఇస్తేనే జనసేనలో చేరాలనే భావనతో ఉన్నారు. అయితే జనసేనకు ఇప్పటికే సంస్థాగతంగా నేతలు ఉన్నారు. యువ నేతలు, జన సైనికులు, వీర మహిళలు కష్టపడి పని చేస్తున్నారు. వీరిని కాదని వలసలు వచ్చిన వారికి జనసేన టిక్కెట్లు ఇస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేని విషయంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement