Thursday, April 25, 2024

రోజురోజుకు పెరుగుతున్న శీతల గాలుల తీవ్రత.. ప్రాణ సంకటంగా మారిన పరిస్థితి

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి): ప్రధానంగా శివారు ప్రాంతాలలో ఉన్న జాతీయ రహదారులపైకి వెళ్ళాలంటే భయప డాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పొగమంచు, చలి తీవ్రత నేపథ్యంలో వాకింగ్‌లు కూడా వాయిదా వేసుకునే పరిస్తితులు. తెల్లవారుజామునే వాకింగ్‌ ప్రారంభించే వాళ్లు ఆలస్యంగా వెళ్తున్నారు.. చలి తీవ్రత నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా శివారు ప్రాంతాలలో చలి పెరగడంతో పాటు పొగమంచు కమ్ముకుంటుంది. తెల్లవారుజామునుండే ఉదయం 8 గంటలవరకు పొగమంచుతో రోడ్లు కనిపించడం లేదు.

ఇది చూడడానికి ఆహ్లాదకరంగా కనిపిస్తున్నా ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోంది. చలి కారణంగా జలుబు, జ్వరాలు వస్తున్నాయి. పొగమంచు కారణంగా అవుటర్‌రింగ్‌రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. తెల్లవారుజామున అవుటర్‌పై ప్రయాణం చేయాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. అవుటర్‌పై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాహనాలు ఎక్కువగా ఉంటాయి.

జలుబులు….జ్వరాలు….

- Advertisement -

ఈదురు గాలులు, పొగమంచు కారణంగా ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఈ సీజన్‌లో ఎక్కువగా జలుబు, జ్వరాలపాలవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం స్పెటర్లు.. చేతులకు గ్లౌజులు, చెవులు, ముక్కు, తల పూర్తిగా కప్పుకోవాలి. మంచు కురిసే వేలలొ తలకు మంకీ క్యాపులు పెట్టు కోకపోతే మాత్రం జలుబు చేసే అవకాశం ఉంది. తీవ్ర చలి కారణంగా ఉదయం చాలామంది వాకింగ్‌లకు దూరమయ్యారు. సంక్రాంతి పండగ తరువాత చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

ఆదిలాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలకంటే కనిష్ట ఉష్ణోగ్రతలు…

గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 28డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణగ్రత 12.8డిగ్రీలుగా నమోదైంది. దుండిగల్‌లో 27.7 గరిష్ట, 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు, హకీంపేటలో 26.9 గరిష్ట, 13.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్టంగా 7.2 ఆ తర్వాత రామగుండంలో కనిష్టంగా 9.6 డిగ్రీలు, మెదక్‌లో 28.6 గరిష్ట, కనిష్టంగా 11 డిగ్రీలు, హన్మకొండలో గరిష్టంగా 28.8 డిగ్రీలు, కనిస్టంగా 12 డిగ్రీలు, ఖమ్మంలో 31.2 గరిష్ట, 12.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోనున్నాయని వాతావరణశాఖ చెబుతోంది.

అక్కడక్కడా చిరు జల్లులు…

రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి కిందిస్థాయి తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయిగుండం బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా , ఆదివారం ఉదయం అయిదున్నగంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement