Tuesday, April 23, 2024

మానవత్వం మాయం డబ్బే…ధ్యేయం

కరోనా కల్లోలానికి మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏవార్త వినాల్సి వస్తుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు మనతో నవ్వుతూ మాట్లాడిన మనిషి ఈ రోజు ప్రాణాలతో లేడనే వార్తలు వినాల్సి రావడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. మహమ్మారి దెబ్బకు కుటుంబాలే అస్తవ్యస్తమవు తున్నాయి. ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతూ కుటుం బాలే కనుమరుగైపోతున్నాయి. కొన్నిచోట్ల ఇంట్లో చనిపోయిన వారి అంత్యక్రియలుపూర్తయ్యేలోపే మరొకరి ప్రాణాలుగాల్లో కలిసి పోతు న్నాయి. దంపతులు, కూతుళ్లు, కుమారులు, అత్తమ మాలు, సమీప బంధువులను ఈ రక్కసి బలి తీసుకుంటోంది. ఇంట్లో ఒకరికి వస్తే.. మిగిలిన వారు హడలిపోతున్నారు. కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉండే బెడ్
దొరుకు తుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడుతున్న నిస్సహాయులను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి.

డబ్బే ధ్యేయం.. దోపిడే మార్గం

రాజధానిలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మానవత్వాన్ని మరిచి డబ్బే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు ఖాళీగా ఉన్నా పైకి లేవని బుకాయిస్తున్నాయి. రోజుకు రూ.లక్ష ఆపైన చెల్లించడానికి సిద్ధపడే వారిని వెంటనే చేర్చుకొని వైద్యం ప్రారంభిస్తున్నాయి. భాగ్యనగరంలో మూడువేలకుపైగా చిన్నా, పెద్దా ఆసుపత్రులున్నాయి. మూడొంతుల వైద్యశాలల్లో కోవిడ్ వైద్యం అందిస్తున్నారు. వీటిలో ఐదువేల వరకు పడకలున్నాయి. అధిక భాగం ఆక్సిజన్ వసతి ఉన్నవి, మరికొన్ని వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. పక్షం రోజులుగా వైద్యశాలలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో అధికులు ఆక్సిజన్ పడకకుగానీ, వెంటిలేటర్ పడడకుగానీ వస్తున్న వారే. వీరిలో ఆక్సిజన్ స్థాయిలు 80-90 మధ్య ఉండేవారే అధికులు. ఇలాంటి వారికి నిమిషానికి 4-8 లీటర్ల ప్రాణవాయువు అందించాలి. కొందరు వెంటిలేటర్లపై ఉంచితేనే బతికి బట్టకట్టే స్థితిలో వస్తున్నారు. ఇప్పటికే గాంధీ, టిమ్స్, కింగ్ కోరి, ఛాతీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా పడకలన్నీ నిండి పోయాయి. చేసేది లేక ఎక్కువ మంది ప్రైవేట్ వైద్య శాలలకే పరుగులు తీస్తున్నారు. ఇక బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో పక్క రాష్ట్రాల వారికి, స్థానికేతరులకు బెడ్లు కేటాయించేందుకే ప్రైవేట్ ఆస్పత్రులు మొగ్గుచూపుతున్నాయి. నాగోలు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు తాజాగా వేసిన బిల్లు సంచలనమైంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ శివారులోని ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. 20 రోజుల
తర్వాతరూ.24 లక్షలు బిల్లు చేతికిచ్చారు. రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో బం ధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేరు. ఇలాంటి ఫిర్యాదులు వైద్య ఆరోగ్యశాఖకు, జీహెచ్ఎంసి కంట్రోల్ రూంకు పదుల సంఖ్యలో వస్తున్నాయి. అయినా తీసుకున్న చర్యలేవీ లేవు. చిన్న చిన్న ఆస్పత్రుల్లోనే ఈ తరహా బిల్లులు వసూలు చేస్తుండగా, కరోనా తో ఆస్పత్రిలో చేరి రూ30నుండి 40 లక్షల వరకు బిల్లులు చెల్లించిన వారు, చనిపోయిన తర్వాత కూడా రూ.25 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ బెదిరించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కోవిడ్ బాధితుడికి ఐసీ యూకురూ.9వేలు, ఆక్సిజన్ బెడ్ కు రూ.7 వేలు, సాధారణ వార్డుకు రూ.4వేల చొప్పున మాత్రమే తీసుకోవాలి. సోమవారం మహబూబాబాద్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి దిల్‌సుఖ్ నగర్ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 11రోజులకు ఇప్పటిదాకా రూ.11 లక్షలు చెల్లించగా, ఇంకా డబ్బులు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని చెప్పడంతో బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.

ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి అందిస్తున్న లెక్కల్లోనూ కనికట్టు ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వానికి అందిస్తున్న లెక్కల్లో వెంటి లేటర్, ఆక్సిజన్ పడకలు ఖాళీ లేనట్లుగా చూపిస్తున్నాయి. ఖర్చు ఎంతైనా వెనకాడని స్థితిలో వచ్చే వారికి వీటిని కేటాయిస్తున్నాయి. ఈ దృక్పథంతో బీమాను ఆమోదించడం లేదు. డెబిట్ కార్డు చెల్లింపులనునిరా కరిస్తున్నాయి. నగదు ఇస్తేనే సమ్మతిస్తున్నాయి. ఆదాయపు పన్ను తప్పించుకోవడానికే ఇదంతా అని ఓ ఆసుపత్రి యజమాని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారశైలిపై రెండు, మూడుసార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం విచారణలోనూ ప్రైవేట్ ఆస్పత్రుల తీరు, దోపిడీ విధానంపై తీవ్రంగా మండిపడింది. అయినా విజిలెన్స్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల జోలికి వెళ్లడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement